చీరమేను సీజన్ వచ్చింది.. అబ్బ.. ఈ కూరతో ఒక్క ముద్ద తిన్నారంటేనా..!

Godavari Districts: వర్షం కురవాలని కోరుకోనిదెవరు.. సన్నని చినుకులు పడుతుంటే, చల్లటి గాలులు వీస్తుంటే.. వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తినాలని, మిరప బజ్జీలు తిని ఓ మాంచి టీ తాగితే ఆ అనుభూతి అద్భుతమైంది కదా..! ఇక అసలు విషయానికి వచ్చేద్దాం..

చీరమేను సీజన్ వచ్చింది.. అబ్బ.. ఈ కూరతో ఒక్క ముద్ద తిన్నారంటేనా..!
Cheeramenu Fishes And Curry
Follow us
B Ravi Kumar

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 21, 2023 | 9:16 AM

ఏలూరు న్యూస్, జూలై 21: వర్షం కురవాలని కోరుకోనిదెవరు.. సన్నని చినుకులు పడుతుంటే, చల్లటి గాలులు వీస్తుంటే.. వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తినాలని, మిరప బజ్జీలు తిని ఓ మాంచి టీ తాగితే ఆ అనుభూతి అద్భుతమైంది కదా..! ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.. వానలు ప్రారంభం కాగానే గోదావరికి వరదలు వస్తాయి. అప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో, గోదావరి పరివాహకంలో నివశించే మత్స్యకారులు చేపల వేట మొదలు పెడతారు. కొందరు వలలు వేసి పెద్ద పెద్ద చేపలు పట్టి అమ్ముకుంటే మరోవైపు ‘చీరమేను’ వేట చాలా ఆసక్తి కరంగా ఉంటుంది.

గోదావరి జిల్లాల వాసులు ఎంతో ఇష్టంగా చీరమేనును తింటారు. గోదావరిలో వర్షాకాలం ప్రారంభంలోనే ఇవి దొరుకుతాయి. మొత్తమ్మీద ఇది బాగా దొరికేది ఏడాదికి ఇరవై రోజులు మాత్రమే. చల్లగా వీచే తూర్పుగాలులకు చీరమీను నీటి అడుగుభాగం నుంచి ఉపరితలం మీదకు చేరుకుంటాయి. గుంపులు గుంపులుగా వచ్చే వీటి కోసం మత్స్యకారులు కాపు కాస్తుంటారు. చేతి వేళ్లసందుల్లో నుంచి వలల్లో నుంచి కూడా జారిపోయేంత చిన్నగా ఉండటం వల్లే వీటిని చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపకి చీరమేను అని పేరు.

సముద్ర నీరు, గోదావరీ జలాలూ కలిసే బురదనీటి మడుగుల్లో ఇవి గుడ్లు పెడతాయి. సముద్రంమీద తూర్పుగాలులు వీచగానే ఆ బురదనీటిలోని గుడ్లన్నీ పిల్లలుగా మారి ఒక్కసారిగా గోదావరీ జలాల్లోకి ఈదుకొస్తాయి. వాటి రాకను గమనించిన పక్షులు వాటిని తినేందుకు ఆ నీళ్లపైన ఎగురుతుంటాయి. అది చూసి మత్స్యకారులు ‘చీరమీను వస్తుందొహో’ అనుకుంటూ వాటిని పట్టుకునేందుకు చీరలు తీసుకుని పడవల్లో బయలుదేరతారు. ప్రస్తుతం వీటికోసం ప్రత్యేక మైన వలలు అందుబాటులో ఉన్నాయి. త్రికోణాకారంలో ఉండే కర్రలకు వలను తొడుగుతారు. వలను నీటిలో ముంచి పైకి తీయగానే చివరి కోణం నుంచి అవి కిందకు జారి ముందుగా సంచిలా ఏర్పాటు చేసుకున్న వల ప్రాంతంలోకి చేరుకుంటాయి. ఇవి కేజీ, రెండు కేజీలు అవ్వగానే వాటిని మత్స్యకారులు బుట్టల్లో నింపుకుంటారు. వీటికోసం మత్స్యకారులు లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒడ్డున ఉండే తక్కువ లోతు నీటిలో దొరుకుతాయి. దీంతో ఇద్దరు మహిళలు చీర చివరి కొనలకు చెరో వైపు పట్టుకుని నీటిలో ముంచుతారు. అలా నీటిలో ముంచిన చీర బయటకు తీయగానే నీరు కారిపోయి చీరమేను మాత్రమే చిక్కుతుంది.

ఇవి కూడా చదవండి

చీరమేను ఎక్కడెక్కడ దొరుకుతుందంటే..

ఇవి యానాంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, కోటిపల్లి, ఐ పోలవరం, కాట్రేనికోన ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా దొరుకుతుంది. ఇక ఏలూరు జిల్లా పోలవరం, కొవ్వూరు , లంక ప్రాంతాల్లో ను ఇవి దొరుకుతాయి. అత్యంత అరుదుగా మాత్రమే దొరికే ఈ చేపను చెట్లకు బలం అన్న భావనతో గతంలో కోనసీమవాసులు కొబ్బరితోటలకు ఎరువుగానూ వేసేవారు. ఇటీవల వీటిని కూరగా వండి వైజాగ్‌, హైదరాబాద్‌ నగరాల్లోని బంధువులకు పంపిస్తున్నారు. యానాం నుంచి అయితే ఫ్రాన్స్‌ దేశానికీ ఈ చేపపిల్లలు ఎగుమతి అవుతుంటాయి. ఇలా ఎగుమతి అయ్యే వాటి ధర అధికంగా ఉంటుంది. అంగుళం పొడవు కూడా లేని ఈ చిట్టి చేపల్ని గతంలో తవ్వ, శేరు, కుంచం, బిందెలతో కొలిచి సైతం అమ్ముతారు. ప్రస్తుతం బిందె ధర 12 వేల రూపాయల వరకు పలుకుతోంది. ఇలా బిందెలతో కొనుక్కుని వెళ్లే మారు వ్యాపారులు ప్రస్తుతం దోసెడు చీరమేనులకు రూ.50 తీసుకుంటున్నారు.

చీరమేను ఎలా వండాలంటే..

చీరమీనుని ఎక్కువగా మసాలా పెట్టి వండుతారు. ఇంకా చీరమీనుని మినప్పిండిలో కలిపి చీరమీను గారెల్నీ, చింతచిగురు-చీరమీను, చీరమీను-మామిడికాయ, చీరమీను-గోంగూర… ఇలా కలగలుపు రుచుల్లో కూడా వండి వడ్డించేస్తుంటారు గోదావరీ తీరవాసులు. కోనసీమ వాసులు చీరమీను కాలంలో ఇంటికి వచ్చే బంధుమిత్రులకు డబ్బాల్లో పెట్టి అందిస్తారు. గోదావరీ పరీవాహక ప్రాంతంలో మాత్రమే దొరికే చీరమీనును పక్క జిల్లాలవాళ్లూకూడా వచ్చి కొనుక్కుని వెళుతుంటారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం బ్యారేజ్లపై కవర్లలో వీటిని అమ్ముతారు. వీటిని పెద్ద చేపలు మాదిరిగా తోమటం, ముక్కలు కోయటం చేయరు. శుభ్రంగా కడిగి ,మసాలా దట్టించి కోడిగుడ్డు ఫ్రై మాదిరిగా, పులుసు గాను వండుతారు. ఈ స్టోరీ చదివాక మీకు చీరమేను తినాలని అనిపిస్తే వచ్చేయండి మరి ఆలస్యం చేయకుండా గోదావరి జిల్లాలకు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..