AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!

నేటి కాలంలో తల్లిదండ్రులకు పిల్లల పెంపకం ఒక సవాలుగా మారింది. ముక్కుపచ్చలారని మూడేళ్ల ప్రాయం నుండే చిన్నారులు స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలైపోతున్నారు. అన్నం తినాలన్నా, అల్లరి చేయకుండా ఉండాలన్నా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఈ డిజిటల్ వ్యసనం వల్ల పిల్లల భవిష్యత్తు, చదువు ఏమైపోతుందోనని అమ్మానాన్నలు ఆందోళన చెందుతున్నారు.

USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!
Landline Technic.jpg
Nikhil
|

Updated on: Mar 02, 2026 | 10:34 PM

Share

ఈ క్రమంలో అమెరికాలోని తల్లిదండ్రులు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రపంచంలో మళ్ళీ పాత కాలపు పద్ధతులను వెలికితీస్తున్నారు. ఆ ఇంటికి వెళితే మీకు వైఫై సిగ్నల్స్ కంటే వైర్లతో కూడిన ఫోన్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చే స్తోమత ఉన్నా.. ఆ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల చేతికి ఒక పాత కాలపు ల్యాండ్‌లైన్ రిసీవర్ ఇస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న ఈ తరం పిల్లలను కాపాడుకోవడానికి వారు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సాంకేతికతను కాదని, మళ్ళీ వెనక్కి వెళ్లడం వెనుక ఉన్న బలమైన కారణం చిన్నారుల భవిష్యత్తు.

  • చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడానికి ప్రత్యామ్నాయంగా అమెరికాలో చాలా కుటుంబాలు తిరిగి ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నాయట. సోషల్‌మీడియా ప్రభావం, ఆన్‌లైన్ భద్రతపై పెరుగుతున్న భయాల నేపథ్యంలో తల్లిదండ్రులు ఈ ధోరణిని అలవర్చుకుంటున్నారు. ఇంటర్నెట్, యాప్‌ల గందరగోళం లేని ఈ ఫోన్ల ద్వారా పిల్లలు ఇతరులతో నేరుగా మాట్లాడటం నేర్చుకుంటారని వారు ప్రగాఢంగా నమ్ముతున్నారు.
  •  స్మార్ట్‌ఫోన్లలో మెసేజ్ పంపడం లేదా రీల్స్ చూడటం వల్ల పిల్లల్లో మాట్లాడే నైపుణ్యం తగ్గిపోతోంది. ల్యాండ్‌లైన్‌ వాడటం వల్ల అవతలి వ్యక్తితో కాన్ఫిడెన్స్‌గా మాట్లాడగలరని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్ ఎత్తినప్పుడు ఎలా పలకరించాలి? మర్యాదగా ఎలా సమాధానం ఇవ్వాలి? అనే ప్రాథమిక విషయాలను పిల్లలు దీని ద్వారా సులభంగా గ్రహిస్తున్నారు. ఏ మాత్రం జంకు లేకుండా ఇతరులతో మాట్లాడటం వల్ల వారిలో బాధ్యతాయుతమైన ప్రవర్తన కనిపిస్తోంది.
  • డిజిటల్ మీడియాకు బానిస అవ్వకుండా ఉండటానికి ఇదొక చక్కని మార్గమని అక్కడి సైకాలజిస్టులు సైతం మద్దతు తెలుపుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలకు అనుగుణంగా ఒక ఉపయోగకరమైన మీడియా ప్లాన్‌ను రూపొందించాలని వారు నొక్కి చెబుతున్నారు. ల్యాండ్‌లైన్‌ ఫోన్ల వల్ల సోషల్ మీడియా వ్యసనం ఉండదు, అలాగే బాధ్యతాయుతమైన డిజిటల్ వాడకంపై అవగాహన పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భద్రతతో పాటు అర్థవంతమైన కమ్యూనికేషన్ ఉండాలని ఆకాంక్షిస్తూ అమెరికాలో మొదలైన ఈ వినూత్న ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి. ఏదేమైనా, పిల్లలను టెక్నాలజీ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఇది ఒక సాహసోపేతమైన అడుగు అని చెప్పాలి.

Follow Us