J-Beauty Skincare Secrets: జపాన్ మహిళల మెరిసే చర్మ రహస్యం ఇదే! ‘జే-బ్యూటీ’తో స్కిన్‌కు డీప్ హైడ్రేషన్
ఇప్పటి వరకు మన చర్మ సౌందర్యం అంటే కేవలం కెమికల్ పీల్స్, ఇన్ స్టంట్ గ్లో ఇచ్చే ఫేషియల్స్, గాఢమైన స్క్రబ్స్ మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ, తక్షణ మెరుపు కోసం మనం చేసే ఇటువంటి ప్రయోగాలు చర్మాన్ని దీర్ఘకాలంలో దెబ్బతీస్తున్నాయి.

అందుకే ఇప్పుడు ప్రపంచం చూపు జపాన్ వైపు మళ్లింది. చర్మాన్ని హింసించకుండా, ప్రశాంతతను అందిస్తూనే అద్దంలా మెరిపించే ‘జే-బ్యూటీ’ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్ గా మారింది. ఆమె ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు.. వయసు అరవై దాటినా చర్మం పాతికేళ్ల యువతిలా మెరిసిపోతుంటుంది. అసలు జపాన్ మహిళల చర్మం అంత మృదువుగా, కాంతివంతంగా ఉండటానికి కారణం ఏంటి? వారు మనలాగా గంటల కొద్దీ పార్లర్లలో గడపరు, గాఢమైన కెమికల్స్ వాడరు. చర్మాన్ని ఒక పసిపాపలా ఎంతో సున్నితంగా చూసుకుంటారు. ఆ అరుదైన అందం వెనుక ఉన్న శతాబ్దాల నాటి రహస్యాలు, వారు వాడే సహజ పదార్థాలు ఏవో తెలుసుకుందాం..
- జపాన్ మహిళలు చర్మ సంరక్షణను ఒక క్రతువులా భావిస్తారు. మనలాగా స్క్రబ్స్ తో చర్మాన్ని పదే పదే రుద్దేయరు. చర్మంలోని మృతకణాలను తొలగించడానికి వారు కొంజాక్ రూట్ అనే మొక్క వేరుతో తయారైన స్పాంజ్ ను ఉపయోగిస్తారు. ఇది నీటిలో తడిపితే జెల్లీలా మారి చర్మానికి ఎలాంటి హాని చేయకుండా శుభ్రపరుస్తుంది. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ కావడం విశేషం.
- జపాన్ లో ప్రసిద్ధి చెందిన మాచా గ్రీన్ టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై ఉండే ఎరుపు, మంట తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అలాగే శతాబ్దాలుగా వారు కమెలియా నూనెను బ్యూటీ సీక్రెట్ గా వాడుతున్నారు. ఇందులో ఉండే ఒమేగా-9, స్క్వాలీన్ వంటి అంశాలు మన చర్మంలోని సహజ కొవ్వులకు దగ్గరగా ఉంటాయి. అందుకే ఇది చర్మంలోకి సులభంగా ఇంకిపోయి, జిడ్డు లేకుండా మృదుత్వాన్ని ఇస్తుంది.
- జపాన్ సిట్రస్ ఫ్రూట్ అయిన యుజు (Yuzu) లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మంపై మచ్చలను తగ్గించి, స్కిన్ టోన్ ను ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇక వసంతకాలంలో పూసే సకురా (Sakura) చెర్రీ పుష్పాల సారం చర్మం వదులు కాకుండా ముడతలను అడ్డుకుంటుంది. వయసు పెరిగినా చర్మం బిగుతుగా ఉండేలా చేయడంలో సకురా అద్భుతంగా పనిచేస్తుంది.
నిజమైన అందం అనేది ఒక్కరోజులో వచ్చే మెరుపు కాదు, అది మన జీవనశైలిలో ఒక భాగం. జపాన్ బ్యూటీ లెసన్స్ మనకు చెప్పేది ఒక్కటే.. చర్మాన్ని గాఢమైన కెమికల్స్ తో ఇబ్బంది పెట్టకండి. సహజ పదార్థాలతో, క్రమశిక్షణతో కూడిన సంరక్షణే చర్మానికి అసలైన మెరుపును, ఆరోగ్యాన్ని ఇస్తుంది.
