కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని గాలికొదిలేసిన అధిష్టానం.. కేడ‌ర్ ఉన్నా, న‌డిపించే నాయ‌కుడులేని పరిస్థితి..!

TDP Gannavaram: తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న స్థానాల్లో కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కూడా ఒక‌టి. ఇక్క‌డ ఎలాగైనా పాగా వేయాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వ‌రుస‌గా మూడుసార్లు ఇక్క‌డ సైకిల్ పార్టీ విజ‌య‌కేత‌నం..

కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని గాలికొదిలేసిన అధిష్టానం.. కేడ‌ర్ ఉన్నా, న‌డిపించే నాయ‌కుడులేని పరిస్థితి..!
TDP Gannavaram
Follow us
pullarao.mandapaka

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 21, 2023 | 10:08 AM

విజయవాడ న్యూస్, జూలై 21: తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న స్థానాల్లో కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కూడా ఒక‌టి. ఇక్క‌డ ఎలాగైనా పాగా వేయాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వ‌రుస‌గా మూడుసార్లు ఇక్క‌డ సైకిల్ పార్టీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా వ‌ల్ల‌భ‌నేని వంశీ గెలిచారు.. అయితే 2019 లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్యే వంశీ అన‌ధికారికంగా ఆ పార్టీలో చేరిపోయారు. అప్ప‌టి నుంచి టీడీపీ ప‌రిస్థితి దారుణంగా మారింది. పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉండ‌టంతో వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ మూడేళ్లుగా పార్టీని ముందుకు తీసుకెళ్ల‌డంలో మాత్రం అధిష్టానం విఫ‌లం అవుతుంది. వంశీ పార్టీని వీడిన త‌ర్వాత ఎమ్మెల్సీ బ‌చ్చుల ఆర్జునుడుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే కొంత‌కాలం నాయ‌కుల‌ను ముందుండి న‌డిపించిన అర్జునుడు అనారోగ్య కార‌ణాల‌తో పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేక‌పోయారు. రెండు నెల‌ల క్రిత‌మే బ‌చ్చుల ఆర్జునుడు అనారోగ్య కార‌ణాల‌తో మ‌ర‌ణించారు.

అయితే అర్జునుడు త‌ర్వాత మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌కు గ‌న్న‌వ‌రం కోఆర్డినేట‌ర్‌గా బాధ్య‌త‌లు అప్పగించారు పార్టీ అధినేత చంద్ర‌బాబు.. కానీ నారాయ‌ణ మాత్రం పూర్తి స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గంలో దృష్టి పెట్ట‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌టం, కేడ‌ర్ ను న‌డిపించ‌డంలో కొన‌క‌ళ్ల నారాయ‌ణ విఫ‌లం అవుతున్నారు. దీంతో గ‌న్న‌వ‌రంలో పార్టీ సెకండ్ కేడ‌ర్, కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఓవైపు చంద్ర‌బాబుపై, టీడీపీపై ఒంటికాలితో లేచే వ‌ల్ల‌భ‌నేని వంశీని ఢీకొట్ట‌డం అంత ఈజీ కాదు.. కానీ అక్క‌డ ఎలాగైనా గెల‌వాల‌ని టార్గెట్ పెట్టుకున్నారు. వంశీ వైసీపీ కండువా క‌ప్పుకున్న త‌ర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కేడ‌ర్ చాలా త‌క్కువ‌మంది మాత్ర‌మే వంశీ వెంట వెళ్లారు. స్థానికంగా రెండు పార్టీల మ‌ధ్య ఉండే ఇబ్బందుల‌తో ఎక్కువ శాతం కేడ‌ర్ ఇప్ప‌టికీ టీడీపీతోనే ఉంది.

అయినా ఏం లాభం.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌ప్ప‌టికీ పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేక‌పోవ‌డం, ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్లుగా ఉండ‌టంతో ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారిపోతుంది. ఇటీవ‌ల గ‌న్న‌వ‌రం కు చెందిన కొంత‌మంది నాయ‌కులు చంద్ర‌బాబును క‌లిసారు.. పార్టీకోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని, ఎలాంటి కేసుల‌కు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు సూచించారు. అంతే త‌ప్ప పార్టీని ఎవ‌రు ఎలా ముందుకు తీసుకెళ్లాల‌నే దానిపై మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. దీంతో కేడ‌ర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్ప‌టికైనా పార్టీ అధిష్టానం గ‌న్న‌వరంకు పూర్తిస్థాయి ఇంచార్జిని నియ‌మించి కేడ‌ర్‌ను ముందుకు న‌డిపించేలా చ‌ర్య‌లు తీసుకుంటే వంశీని ఓడిస్తామంటున్నారు టీడీపీ కార్య‌క‌ర్త‌లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..