మరో ఇద్దరు పూజారులను అరెస్టు చేసిన పోలీసులు.. ఆర్‌ఎస్‌ఎస్ అభ్యంతరం
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఇప్పట్లో ఆగేలాలేవు. ఇప్పటికే అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) కార్యకలాపాలపై నిషేధం విధించిన అక్కడి ప్రభుత్వం తాజాగా మరో ఇద్దరు పూజారులను అకారణంగా అరెస్ట్ చేసింది.. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది..
ఢాకా, డిసెంబర్ 1: బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు అక్కడి మైనారిటీలు, హిందువులు లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను దేశ ద్రోహం నేరం మోపి జైలులో పెట్టారు. బంగ్లాదేశ్ అంతటా హిందువుల విస్తృత నిరసనల మధ్య ఈ పరిణామం జరిగింది. తాజాగా మరో ఇద్దరు హిందూ పూజారులను బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరు పూజారులు జైల్లో ఉన్న చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు కావడం విశేషం.
చిట్టోగ్రామ్‌లోని జైలులో ఉన్న చిన్మోయ్ దాస్‌కు ఆహారం, మందులు ఇవ్వడానికి రుద్రప్రోతి కేసబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్ అనే ఇద్దరు పూజారులు గురువారం వెళ్ళగా.. వారిని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రోబోర్టక్ సంఘ ప్రిన్సిపాల్ స్వతంత్ర గౌరంగ దాస్ మాట్లాడుతూ.. మా ఇద్దరు సభ్యులు జైలులో చిన్మోయ్ కృష్ణకు ఆహారం అందించడానికి వెళ్ళినప్పుడు అరెస్టు చేసినట్లు నాకు వాయిస్ రికార్డింగ్ ద్వారా తెలిసింది. రికార్డింగ్‌లో రుద్రప్రోతి కేసబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్ తాము అరెస్టయినట్లు మాకు తెలియజేశారు. వీరిని కొత్వాలీ పోలీసు స్టేషన్‌లో అరెస్ట్ చేశారని, వారిని జైలుకు పంపుతున్నారని మరో వాయిస్ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసుల గురించి ఎలాంటి వివరాలను అందించకుండా కొనసాగుతున్న దర్యాప్తులో ఇద్దరు పూజారులను అనుమానితులుగా పరిగణిస్తున్నామని బంగ్లాదేశ్ పోలీసు తెలిపారు. కాగా ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) హిందూ సమాజ సభ్యులపై తీవ్రమైన అణిచివేత చర్యలు జరుగుతున్నాయి. 200 పైగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. వారంలో బంగ్లాదేశ్ అధికారులు చిన్మోయ్ కృష్ణ దాస్‌తో సహా ఇస్కాన్‌తో సంబంధం ఉన్న 17 మంది బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. పైగా ఇస్కాన్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ బంగ్లా హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. వీటిని విచారించిన కోర్టు ఈ గ్లోబల్ ఆర్గనైజేషన్‌పై నిషేధం విధించేందుకు నిరాకరించింది. బంగ్లాదేశ్‌లోని హిందువులపై దాడులు సరిహద్దులో కూడా ప్రతిధ్వనించాయి. కోల్‌కతా-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో నిరసనలు మిన్నంటాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతు న్న అఘాయిత్యాలపై స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.