Telangana: ఎంత పనిచేశావమ్మా..? ఇంటర్ విద్యార్థిని ప్రాణంతీసిన ‘ఇంగ్లిష్’.. అసలేం జరిగిందంటే?
తెలిసీ తెలియని వయసులో ఏదైనా కష్టం వస్తే దానిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చిన్న వయసులోనే విద్యార్ధులు తనువు చాలిస్తున్నారు. తాళం చెవి లేకుండా తాళం ఉండదు.. అలాగే పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదు. వచ్చిన సమస్యంతా ఓపిక లేకపోవడంలోనే ఉంది...
మంచిర్యాల, నవంబర్ 29: చిన్న చిన్న కారణాలకే విద్యార్ధులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నో ఆశలతో కని పెంచిన కన్నోళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. కారణం తెలిస్తే.. ఇంత చిన్న దానికే ప్రాణాలు తీసుకున్నావామ్మ.. అని మీరూ అంటారు. ఈ షాకింగ్ ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోతన్‌పల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథ నం ప్రకారం..
మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోతన్‌పల్లికి చెందిన నలాటుకూరి బానేశ్, కవిత దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో అనుశ్రీ (16) పెద్ద కుమార్తె. పదో తరగతి పూర్తి చేసిన అనుక్ష.. రామకృష్ణాపూర్‌లోని కస్తుర్బాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే అనుశ్రీ టెన్త్ వరకు తెలుగు మీడియంలో చదివింది. ఇంర్మీడియట్ ఇంగ్లిష్ మీడియంలో జాయిన్ అయ్యింది. అప్పటి వరకూ తెలుగు మీడియంలో చదివి ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలోకి రావడంతో.. తరగతులు అర్ధంకాక ఇబ్బంది పడుతూ వచ్చింది.
తనకు ఇంగ్లిష్ అర్థంకావడంలేదనీ, తెలుగుమీడియంలో చేర్పించాలని తండ్రికి పలుమార్లు చెప్పింది. అయితే రెండో సంవత్సరంలో తెలుగు మీడియంలో చేర్పిస్తానని తండ్రి సర్ధి చెప్పాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనుశ్రీ వ్యవయసాయానికి ఉపయోగించే గడ్డి మందు తాగింది ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిప కుటుంబ సభ్యులు హుటాహుటీన మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి అనుశ్రీ మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.