Russia – Ukraine War: క్రిమియా తీరంలో రష్యా నౌకాదళంపై డ్రోన్ దాడి.. ఉక్రెయిన్‌పై అధికారుల అనుమానం..!
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకీ కొత్త ములుపులు తిరుగుతోంది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత భూభాగాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించినా రష్యా వాటిపై పట్టును నిలుపుకోలేకపోతోంది.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకీ కొత్త ములుపులు తిరుగుతోంది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత భూభాగాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించినా రష్యా వాటిపై పట్టును నిలుపుకోలేకపోతోంది. ఉక్రెయిన్ సేనల నుంచి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా క్రిమియా తీరంలోని సెవాస్టోపోల్ పోర్ట్ వద్ద రష్యన్ దళాలపై అనూహ్యంగా డ్రోన్ దాడి జరిగింది. నల్ల సముద్రంలోని నౌకలపై జరిగిన ఈ దాడిని తిప్పి కొట్టామని అధికారులు ప్రకటించారు. తమ మౌళిక సదుపాయాలకు తమకు ఎలాంటి నష్టం జరగలేదని అంటున్నారు. అయితే నౌకపై దాడి, మంటలు చెలరేగిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.. ఈ దాడిలో పలు రష్యన్ నౌకలు దగ్దమయ్యాయి.. తీర ప్రాంతమంతా దట్టమైన పొడలు వ్యాపించాయి. దీంతో ఇక్కడి నౌకాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేసినట్లు తెలుస్తోంది. కాగా ఇది ఉక్రెయిన్ జరిపిన దాడేనని రష్యన్ సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. అనేక గంటలపాటు సెవాస్టోపోల్‌లోని వివిధ వాయు రక్షణ వ్యవస్థలు డ్రోన్ దాడులను తిప్పికొట్టాయని సెవాస్టోపోల్ గవర్నర్ మిఖాయిల్ రజ్వోజాయేవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు.
కొద్ది రోజులకు ముందు సెవాస్టోపోల్ సమీపంలోని థర్మల్ విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత క్రిమియా-రష్యాను కలిపే కెర్చ్ వంతెనపై పేలుడు చోటు చేసుకుంది.. ఇది ఉక్రెయిన్ జరిపిన దాడులేనని రష్యా ప్రకటించినా, ఆ దేశం స్పందించలేదు.
తాజా డ్రోన్ దాడి ఘటనలతో ఉక్రెయిన్, రష్యాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింతగా పెరిగింది. ఉక్రెయిన్ డర్టీబాంబ్ ప్రయోగించబోతోందని రష్యా వ్యక్తం చేసిన అనుమానాలు, రష్యా చేయపట్టిన న్యూక్లియర్ డ్రిల్స్ యూరోపియన్ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..