Pope Francis: విషమంగా రోమ్ కాథలిక్ చర్చి అధినేత పోప్ ఆరోగ్యం.. తదుపరి పోప్ ఎవరన్నదానిపై చర్చలు..!
ఫ్రాన్సిస్ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తీవ్రమైన శ్వాసకోస సమస్యతో రోమ్‌లోని జెమెల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు వైద్యులు ఆయనకు రక్తమార్పిడి చేసి, హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఫిబ్రవరి 14 న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన పోప్ గత 9 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు..

రోమ్, ఫిబ్రవరి 23: రోమ్ కాథలిక్ చర్చి మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత వారం ఆయనకు తీవ్రమైన శ్వాసకోస సమస్య తలెత్తింది. దీంతో రోమ్‌లోని జెమెల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు వైద్యులు రక్తమార్పిడి చేసి, హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఫిబ్రవరి 14 న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన పోప్ గత 9 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పోప్ ఆరోగ్యం విషమంగానే ఉందని వాటికన్ శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.
రోజువారీ రక్త పరీక్షల్లో రక్తహీనతతో సంబంధం ఉన్న థ్రోంబోసైటోపీనియా కనిపించింది. దీనికి రక్త మార్పిడి అవసరం. అందుకే రక్తమార్పిడిచేశాం. శుక్రవారం కంటే శనివారం మరింత కష్టంగా గడిచింది. న్యూమోనియాతోపాటు సంక్లిష్టమైన శ్వాస ఇన్‌ఫెక్షన్‌తో పోప్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మరో వారం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని వెల్లడించారు. వాటికన్ మాత్రం పోప్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ప్రకటించింది. ఆయన ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదని పేర్కొంది.
కాగా దక్షిణార్ధ గోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936లో జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. కానీ ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది. 2021 నుంచి 23 మధ్యలో పెద్ద పేగు సర్జరీ కూడా జరిగింది. ఆ తర్వాత పోప్ బిజీ షెడ్యూల్ కొనసాగించారు. సెప్టెంబర్‌లో ఆసియా-పసిఫిక్‌కు 12 రోజుల పర్యటన చేశారు. కానీ 2023 తర్వాత నుంచి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అధిక బరువుతో పాటు తరచూ తుంటి , మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. అందువల్లనే ఆయన ఎక్కువ సమయం వీల్‌చైర్‌లోనే ఉంటున్నారు.
మరోవైపు 1.4 బిలియన్ క్యాథలిక్స్‌లకు పెద్దగా వ్యవహరిస్తున్న పోప్ ఆస్పత్రిలో చేరడంతో తదుపరి పోప్ ఎవరన్న దానిపై సుదీర్ఘ చర్చలు నడుస్తున్నాయి. వాటికన్ విదేశాంగ కార్యదర్శి పియట్రో పరోలిన్ ఇటలీకి చెందిన కొరియర్ డెల్లా సెరా దినపత్రికతో మాట్లాడుతూ.. ఇలాంటి చర్చలు సాధారణమేనని అన్నారు. అయితే ఇలాంటి పనికిరాని ఊహాగానాలకు అంత ప్రాధాన్యత ఇవ్వమని ఆయన అన్నారు. ప్రస్తుతం పోస్ ఆరోగ్యం గురించి, ఆయన త్వరగా కోలుకోవడం గురించే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సన్యాసినులు, ప్రీస్ట్‌లతో కూడిన బృందం శనివారం జెమెల్లి ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఫ్రాన్సిస్ 10వ అంతస్తులోని ప్రత్యేక పాపల్ సూట్‌లో బస చేసి, ఆయన కోసం ప్రార్థనలు చేసినట్లు బ్రెజిలియన్ ప్రీస్ట్ డాన్ వెల్లిసన్ మీడియాకి చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.