ఓరి అసాధ్యుడా..! వృద్ధురాలైన తల్లిని ఇంట్లో లాక్ చేసి కుంభమేళాకు వెళ్లిన కొడుకు.. ఆ తర్వాత జరిగిందిదే
వృద్ధురాలైన తన తల్లిని ఇంట్లో బంధించి, ఇంటికి తాళం వేసి.. భార్య, పిల్లలతో కలిసి కుంభమేళాకు వెళ్లాడో ప్రబుద్ధుడు. మూడు రోజుల తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు నిలుపుకునేందుకు ప్లాస్టిక్ తినేందుకు కూడా ప్రయత్నించింది. చివరకు ఆకలి తట్టుకోలేక కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆమెకు ఆహారం అందించారు..

రాంచీ, ఫిబ్రవరి 21: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని ఇంట్లో బంధించి, ఇంటికి తాళం వేసి.. భార్య, పిల్లలతో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. మూడు రోజుల తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు నిలుపుకునేందుకు ప్లాస్టిక్ తినేందుకు కూడా ప్రయత్నించింది. చివరకు ఆకలి తట్టుకోలేక వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గమనించి, ఇంటి తాళం పగలగొట్టి ఆమెకు ఆహారం అందించారు. ఈ షాకింగ్ సంఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే..
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో నివాసం ఉంటున్న అఖిలేష్ ప్రజాపతి అనే వ్యక్తి తల్లి సంజు దేవి (65) ఇంట్లోనే ఉంచి ఫిబ్రవరి 17న తాళం వేశాడు. అనంతరం తన భార్య, పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు కుమారుడు ఇంట్లో ఉంచిన అన్నం, నీళ్లతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత తినేందుకు ఏమీ లేకపోవడంతో ఆకలి తట్టుకోలేకపోయింది. చివరకు ప్లాస్టిక్ తినేందుకు కూడా ఆమె ప్రయత్నించింది. ఆకలికి తట్టుకోలేక కేకలు వేయడంతో.. ఆమె అరుపులు విన్న స్థానికులు ఆమె కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు. చాందినీ దేవి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి, భోజనం పెట్టి, అనంతరం వెంటనే వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ కుమార్ వృద్ధురాలి కొడుకు అఖిలేష్ ప్రజాపతిని ఫోన్‌లో సంప్రదించగా.. తన చర్యలను సమర్థించుకున్నాడు. సోమవారం ఉదయం 11 గంటలకు తాము వెళ్లేముందు తల్లికి ఆహారం, బియ్యం, ఇతర నిత్యావసరాలు అందించిన తర్వాతే ఇంటి నుంచి బయల్దేరామని చెప్పాడు. తన తల్లి కుంభమేళాకు వెళ్లమని చెప్పిందని, ఆమె అనారోగ్యంతో ఉందని, అందుకే తమతోపాటు ఆమెను తీసుకెళ్లలేదని అతను చెప్పాడు. బాధితురాలు సంజు దేవి కుమార్తె చాందిని దేవి మాట్లాడుతూ.. సోదరుడు కుంభమేళాకు బయలుదేరే ముందు ఆమెను ఇంట్లో బంధించే బదులు తనకి అప్పగించి వెళ్లి ఉంటే, తాను జాగ్రత్తగా తల్లిని చూసుకుంటానుకదాని అన్నారు. దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ కృష్ణ కుమార్ తెలిపారు. మరోవైపు రామ్‌గఢ్ పోలీసు సూపరింటెండెంట్ (SP) అజయ్ కుమార్ ఈ చర్యను ఖండించారు. ఇది పూర్తిగా అమానవీయమైనదన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.