GBS Deaths: అంతుచిక్కని మహమ్మారితో మరో ఇద్దరు మృతి.. ఏపీలో వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి
జనవరి నెలారంభం నుంచి మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్-బారే సిండ్రోమ్ అనుమానిత కేసులు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా పూణేకు చెందిన ఇద్దరు రోగులు ఈ వ్యాధితో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరింది. అటు ఏపీలోనూ ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది..

పూణె, ఫిబ్రవరి 20: గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) దేశ వ్యాప్తంగా జనాలను కలవర పెడుతుంది. మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ వ్యాధి కేసులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా పూణే ఆసుపత్రుల్లో ఈ వ్యాధితో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు రోగులు మరణించడం తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా మరణించిన వారి సంఖ్య 11కి చేరిందని అధికారులు బుధవారం (ఫిబ్రవరి 19) తెలిపారు. తాజాగా ఈ వ్యాధితో మరణించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు 27 ఏళ్ల మహిళ, మరొకరు 37 ఏళ్ల వ్యక్తి ఉన్నారు.
జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్న మహిళ మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, పూణే జిల్లాలోని దౌండ్‌కు చెందిన వ్యక్తి సోమవారం ప్రభుత్వ సస్సూన్ జనరల్ ఆసుపత్రిలో మరణించాడు. మరణించిన మహిళ జీబీఎస్ వ్యాధి వ్యాప్తికి కేంద్రంగా ఉన్న నాందేడ్‌గావ్ ప్రాంతానికి చెందిన నివాసి. ఆమె జనవరి 15న తీవ్ర విరేచనాలు సమస్యతో ఆస్పత్రిలో చేరింది. కానీ ఎటువంటి మందులు వినియోగించకుండానే ఆమె కోలుకుంది. ఆ తర్వాత జనవరి 22న ఆమె కాళ్ళ కింది భాగంలో చచ్చుబడినట్టు అయింది. దీంతో ఆమెను జీబీఎస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో జనవరి 25న ఆమెను మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ లైఫ్ సపోర్ట్ పరికరాలు అమర్చి చికిత్స చేయడం ప్రారంభించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న మరణించిందని అధికారులు తెలిపారు.
జనవరి 10న ఇదే వ్యాధితో మరో వ్యక్తి సాసూన్ జనరల్ ఆసుపత్రిలో చేరాడు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది తలెత్తడంతో సోమవారం అతను మరణించారు. దీంతో బుధవారం నాటికి మొత్తం GBS కేసుల సంఖ్య 211కు చేరింది. అయితే కొత్త కేసులు నమోదు కాకపోవడం విశేషం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో గుల్లెయిన్ బారే సిండ్రోమ్ (GBS)తో మరో మహిళ బుధవారం మరణించింది. దీంతో రాష్ట్రంలో GBS కారణంగా మరణించిన వారి సంఖ్య 5కు చేరింది. ఫిబ్రవరి 2న GBS లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరిన షేక్ గౌహర్ జాన్ బుధవారం మరణించారు. అంతకుముందు నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో విజయనగరం జిల్లాకు చెందిన రేణుకా మొహంతి (63), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సునీత (35), ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ ఉన్నారు. ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ ప్రకారం.. రాష్ట్రంలో 18 BGS కేసులు ఉన్నాయి. గత 40-50 రోజుల్లో మొత్తం 45 కేసులు నమోదయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








