500 అణుబాంబులతో సమానమైన గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. ఇండియాలో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఇవే!
వైఆర్4 అనే గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు దూసుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమిని ఢీ కొట్టే అవకాశం రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో అసలు ఒక వేళ భూమిని నిజంగానే ఢీ కొంటే ఏ ప్రాంతంలో ఢీ కొంటుందని కూడా సైంటిస్టులు అంచనా వేశారు. ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఇండియా కూడా ఉంది. మరి ఇండియా మొత్తం పోతుందనే అంటే.. కాదు. ఇండియాలోని కొన్ని నగరాలకే ముప్పు పొంచి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మనవాళి, కోట్ల కొలది జీవరాసులు జీవిస్తున్న ఈ భూ గ్రహానికి ముప్పు పొంచి ఉందని గతేడాది డిసెంబర్‌లో నాసా ఓ సంచలన ప్రకటన చేసింది. ఓ గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు దూసుకొస్తుందని, అది కనుక భూమిని ఢీ కొంటే ఓ 500 బాంబులు పడినంత విధ్వంసం సృష్టిస్తుందని తెలిపారు. 2024 డిసెంబర్ 27న చిలీలోని ఎల్ సాస్ అబ్జర్వేటరీ ఈ ముప్పును కనిపెట్టింది. ఈ అబ్జర్వేటరీ కూడా నాసా ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఈ గ్రహశకలానికి 2024 YR4 అనే పేరు పెట్టారు. 2032 డిసెంబర్‌లో ఇది భూమిని ఢీ కొనే ఛాన్స్ ఉందంటున్నారు. తొలుత ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టే అవకాశం తక్కవగానే ఉందని అంచనా వేశారు. కానీ, వారం వ్యవధిలోనే అది 2.3 శాతనికి పెరిగింది.
ఇక ఇప్పుడు తాజా నివేదికల ప్రకారం.. ఈ వైఆర్4 గ్రహశకలం భూమిని ఢీ కొట్టే అవకాశం 3.1 శాతంగా ఉందని నాసా తెలిపింది. అంటే క్రమక్రమంగా భూమికి ముప్పు వచ్చే ఛాన్స్ పెరుగుతుందని అర్థం. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైతం 2.8 శాతంగా అంచనా వేసింది. చూసేందుకు చాలా తక్కువ సంఖ్యలోనే ప్రమాదం సంభవించే అవకాశం కనిపిస్తున్నా.. అవి చాలా విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉంది. వచ్చే నెల అంటే మార్చ్‌లో అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా నాసా శాస్త్రవేత్తలు ఆ గ్రహశకలాన్ని పరిశీలించనున్నారు. ఈ పరిశీలనతో గ్రహశకలం పరిమాణం, దాని వేగంపై మరింత కచ్చితమైన సమాచారం లభించనుంది. ఇక వేళ 2024 YR4 భూమిని ఢీకొంటే, ఫలితాలు విపత్కరంగా ఉంటాయి. గంటకు 40,000 మైళ్ల వేగంతో కదులుతూ, ఆ గ్రహశకలం ఎనిమిది మెగాటన్ల TNT పేలుడు శక్తిని ఉత్పత్తి చేయగలదు. పెద్ద పెద్ద నగరాలను నేలమట్టం చేస్తూ, ఊహించలేని వినాశనాన్ని మిగుల్చుతుంది. ఇది భూ గ్రహం మొత్తాన్ని అంతం చేయలేదు కానీ, పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రస్తుతం అది తిరుగుతున్న కక్ష్య ఆధారంగా అది భూమిని ఈ వైపు ఢీ కొట్టుంది, ఏఏ దేశాలు ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉంది, అందులోనూ మరీ ముఖ్యంగా ఏఏ నగరాలకు ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని కూడా సైంటిస్టులు వెల్లడించారు. తూర్పు పసిఫిక్, ఉత్తర దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, అరేబియా సముద్రం, దక్షిణ ఆసియాపై ప్రభావం పడుతుంది. దక్షిణ ఆసియాలో ఉన్న ఇండియాపై కూడా గ్రహశకల ప్రభావం పడనుంది. ఇండియాలోని ముంబై, కోల్‌కతా నగరాలతో పాటు బంగ్లాదేశ్‌లోని ఢాకాపై గ్రహశకలం సృష్టించే విధ్వంసం ప్రభావం చూపనుంది. దాదాపు 110 మిలియన్లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ ప్రాంతాలన్ని భారీ జనసాంద్రత కలిగిన ప్రాంతాలే.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.