AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోమల్ని పట్టిస్తే ప్రైజ్‌మనీ! జోక్‌ కాదు నిజంగానే.. చంపి లేదా బతికున్న దోమల్ని ఇస్తే వీళ్లు డబ్బులిస్తారు!

దోమలు మనల్ని కుడితే ఫట్‌మని కొట్టి చంపాలనిపిస్తుంది. హిట్‌లు, ఆలౌట్‌లు, గుడ్‌నైట్‌లు, జెట్‌ కాయిల్స్‌ పెట్టి మరీ వాటిని చంపుతుంటాం. నిద్రపోతున్నప్పడు చెవుల దగ్గరికి వచ్చి కీఈఈఈ... మంటే మనకు చాలా చిరాకేస్తుంది. కానీ, ఈ వార్త వింటే మాత్రం ఆ కీ సౌండ్‌ కూడా ఏఆర్‌ రెహామాన్‌ సంగీతంలా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దోమలతో అంత పని పడింది. వాటిని ఇచ్చి డబ్బులు తీసుకునే ఛాన్స్‌ వచ్చింది. అది ఎలాగంటే..

దోమల్ని పట్టిస్తే ప్రైజ్‌మనీ! జోక్‌ కాదు నిజంగానే.. చంపి లేదా బతికున్న దోమల్ని ఇస్తే వీళ్లు డబ్బులిస్తారు!
Philippine Mosquitoes
SN Pasha
|

Updated on: Feb 20, 2025 | 9:11 AM

Share

దోమల్ని ఇస్తే డబ్బులివ్వడం ఏంటీ? వాళ్లకేమైనా పిచ్చా? అసలు అలా ఎవరైనా డబ్బులిస్తారా? అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడుతున్నట్లే. నిజంగానే దోమల్ని తీసుకొచ్చి ఇస్తే డబ్బులు ఇస్తున్నారు. అది కూడా మీరు తెచ్చిన వాటిని లెక్కపెట్టి, ఎన్ని ఎక్కువ దోమల్ని తెస్తే అన్ని ఎక్కువ డబ్బులు ఇస్తారు. పైగా ఇందో ఉన్న పెద్ద అడ్వాంటేజ్‌ ఏంటంటే.. మీరు బతికున్న దోమల్ని తేవొచ్చు, చంపిన వాటిని తేవొచ్చు చివరికి దోమ లార్వాను కూడా తీసుకొచ్చి, ఎన్ని తీసుకొచ్చారో లెక్కగట్టి, అందుకు తగిన మొత్తాన్ని మీరు పొందవచ్చు. అబ్బా డబ్బులు సంపాదించేందుకు నానా కష్టాలు పడుతున్నాం, మా ఇంట్లో, మా ఏరియాలో మస్తుగా దోమలున్నాయి.. వెంటనే పట్టుకొచ్చేస్తాం ఆ ఆఫర్‌ ఎక్కడ ఇస్తున్నారో చెప్పు బ్రో అంటారా? అయితే చదువుకోండి.

ఫిలిఫ్పీన్స్‌ రాజధాని మానీలా సమీపంలోని ఓ గ్రామంలో ఈ వినూత్న ఆఫర్‌ను పెట్టారు. అది కూడా ఏకంగా ఆ గ్రామ నాయకుడే ఈ విధంగా ఒక స్కీమ్‌ తీసుకొచ్చాడు. అదేంటి ఆయనకు దోమలంటే అంత ఇష్టమా? కొంపదీసి దోమల కర్రీ ఏమైనా చేసుకొని తింటాడా అంటూ పాపం అతన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ గ్రామంలో డెంగీ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు ఆయన ఈ వినూత్న ఆలోచన చేశారు. దోమల్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా.. అక్కడ దోమలు అంతం కావడం లేదు. పైగా డెంగీ జ్వరంతో ఏకంగా ఇద్దరు విద్యార్థులు ఇటీవలె మరణించారు. ఫిబ్రవరి 1 నాటికి ఫిలిప్పీన్స్‌లో ఏకంగా 28,234 మంది డెండీ జ్వరంతో మంచం పట్టారు.

దోమల కారణంగానే డెండీ వ్యాప్తి చెందుతుండటంతో ఎలాగైన ఈ దోమల అంతం చూడాలని మనీలా సమీపంలోని ఓ గ్రామంలో దోమలు తీసుకొస్తే ప్రైజ్‌మనీ ఇస్తామని ప్రకటించారు. ఓ ఐదు దోమలు లేదా లార్వాలకు ఒక ఫిలిప్పీన్‌ పెసో(మన కరెన్సీలో 1.5 రూపాయలు) ఇస్తామని చాటింపు వేయించారు. అంతే ఆ గ్రామంలోని ప్రజలు దోమలపై దండయాత్రనే మొదలుపెట్టారు. దోమల్ని చంపి, వాటిని లార్వాలను పట్టుకొచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు. ఐదు దోమలకు రూపాయిన్నరేనా అని తీసిపారేయకండి. దోమలు కుప్పగా దొరికితే గట్టిగా సంపాదించవచ్చు. ఇప్పటికే ఆ గ్రామంలో చాలా మంది కేవలం దోమల్ని చంపడమే పనిగా పెట్టుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.