Hyderabad Population: జనాభా పెరుగుదలలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్.. ఆ ముప్పు తప్పదిక! కారణం ఇదే..
జనాభా పెరుగుదలలో హైదరాబాద్ నగరం దేశ రాజధాని ఢిల్లీని ఎప్పుడో దాటేసింది. ఢిల్లీ చదరపు కిలోమీటరుకు 11,313 మంది జనాభా నివసిస్తుంటే... హైదరాబాద్‌లో మాత్రం చదరపు కిలోమీటరుకు 18,161 మంది నివసిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే హైదరాబాద్‌లో జనాభా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది..

హైదరాబాద్, ఫిబ్రవరి 19: హైదరాబాద్ మహా నగరంలో జనాభా నానాటికీ పెరిగిపోతుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని కూడా అధిగమించి ముందంజలో కొనసాగుతుంది. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ (ATLAS)-2024 ప్రకారం నగరంలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది జన సాంద్రత ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీని హైదరాబాద్ అధిగమించినట్లు గణాంకాలు తెల్పుతున్నాయి. ఢిల్లీలో చదరపు కిలోమీటరుకు 11,313 మంది జనాభా నివసిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే హైదరాబాద్‌లో జనాభా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరం ఫిలిప్పీన్స్‌లోని మనీలా. మనీలాలో ఒక చదరపు కిలోమీటరుకి 43,079 మంది ప్రజలు నివసిస్తున్నారు. భారత్‌లో మాత్రం అధిక జనసాంద్రతలో ముందున్న నగరం ముంబై. ముంబై నగరం చదరపు కిలోమీటరుకు 28,508 మంది జనసాంద్రతతో అగ్రస్థానంలో ఉంది. వేగవంతమైన పట్టణీకరణ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఇదే ప్రముఖ నగరాల్లో జనాభా విపరీతంగా పెరడానికి ప్రధాన కారణం. హైదరాబాద్ నగరం నానాటికీ వృద్ధి పథంలో పరుగులు తీస్తున్నప్పటికీ పెరుగుతున్న జనాభా.. మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలు, గృహనిర్మాణంపై పరిమితికి మించి ఒత్తిడిని కలిగిస్తుందని పట్టణ ప్రణాళికదారులు అంటున్నారు. హైదరాబాద్ నగరానికి ఎక్కువ మంది ఉపాధి నిమిత్తం తరలివస్తుండటం, వనరుల డిమాండ్ ఈ రెండూ మునుముందు రోజుల్లో పెను సవాళ్లను తీసుకురానుంది.
హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగం, దాని సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత కారణంగా పలువురు నిపుణులు, విద్యార్థులు, వ్యవస్థాపకులను అమితంగా ఆకర్షిస్తుందని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ జనాభా సాంద్రత పెరుగుతున్నప్పటికీ, తెలంగాణ మొత్తం మార్పును ఎదుర్కొంటోంది. అయితే 2011 – 2031 మధ్య జాతీయ జనాభాలో రాష్ట్ర వాటా 0.23 శాతం పాయింట్లు తగ్గుతుందని అంచనా. 2031 నాటికి తెలంగాణలో జనాభా తగ్గుదల గణనీయంగా తలెత్తే అవకాశం ఉంది. 39 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువ జనాభా తగ్గిపోతుంది. 40 ఏళ్లు ముఖ్యంగా 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో మాత్రం గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఇది రాబోయే దశాబ్దాలలో రాష్ట్రం ఎదుర్కొనే యువ జనాభాకు తగ్గుదలకు సంకేతంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.5 కోట్లు. ఇది 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతాన్ని కలిగి ఉంది. చదరపు కిలోమీటరుకు 312 మంది జన సాంద్రత ఉంది. హైదరాబాద్ జనసాంద్రతతో నిండి ఉన్నప్పటికీ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల జనసాంద్రత పరంగా ఎంతో వెనుకబడి ఉన్నాయి. చదరపు కిలోమీటర్‌కు సుమారు 300 మంది సాంద్రత కలిగిన 10 రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉన్న బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా వెనుక బడి ఉంది. 2031 నాటికి రాష్ట్ర జనాబా 3.92 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది జాతీయ జనాభాలో రాష్ట్ర వాటా స్వల్ప తగ్గుదలను సూచిస్తుంది. ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జనాభాలో అత్యంత తగ్గుదల ఉంటుంది. 2021 – 2031 మధ్య 25 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా. అదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 60 శాతానికిపైగా పెరుగుతుందని అంచనా.
జనాభా డైనమిక్స్‌లో ఈ మార్పులు ముఖ్యంగా నిధులు, గ్రాంట్ల విషయానికి వస్తే గణనీయమైన ఆర్థిక, రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది. యువ జనాభా తగ్గుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు యువత అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించే వివిధ వనరులను కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో రాష్ట్ర జనాభా 3.5 కోట్లుగా నమోదైంది. దాదాపు 16 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదు. తెలంగాణ జనాభా వస్తున్న ఆ మార్పులు యువత, వృద్ధుల జనాభా అవసరాలను తీర్చడంతో పాటు, వృద్ధి, స్థిరత్వాన్ని సమతుల్యం చేసే సవాళ్లను మునుముందు ఎదుర్కొంటుందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.