Pariksha Pe Charcha 2025: ‘ఏఐ శత్రువు కాదు.. తెలివిగా వాడుకోవాలి’ పరీక్షా పే చర్చలో టెక్నికల్ గురూజీ సూక్తులు
ఢిల్లీలోని సుందరవనంలో జరిగిన పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు విద్యార్ధులకు విలువైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం కోసం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు. నేరుగా మాత్రం 36 మంది, మిగతావారంతా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు..

పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ యేటా ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తేదీన ఢిల్లీలో జరిగింది. పరీక్షా పే చర్చ 2025 3వ ఎపిసోడ్‌లో టెక్నికల్ గురూజీగా ప్రసిద్ధి చెందిన యూట్యూబర్ గౌరవ్ చౌదరి, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ యొక్క MD, CEO రాధిక గుప్తా పాల్గొన్నారు. విద్యార్థులు AIని తెలివిగా ఎలా ఉపయోగించవచ్చనే దానిపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
టెక్నాలజీకి బానిస కాకూడదు.. యజమానిలా వాడుకోవాలి
సాంకేతికత తమను నియంత్రించనివ్వకుండా దానినే నియంత్రించుకోవాలని గౌరవ్ చౌదరి విద్యార్థులకు సూచించారు. సాంకేతికతకు బానిసలుగా కాకుండా దానిలో మాస్టర్స్‌గా మారడం నేర్చుకోవాలని అన్నారు. ప్రతి చిన్న దానికీ టెక్నాలజీపై ఆధారపడకుండా దానిని ఓ సహాయకారిగా మాత్రమే ఉపయోగించడం నేర్చుకోవాలని సూచించారు.
AI ని ఒక సాధనంగా పరిగణించాలి
ఏఐని అధ్యయనాలకు సహాయపడే సాధనంగా పరిగణించాలని, దృష్టిని మళ్లించేదిగా ఉండకూడదని పేర్కొన్నారు. AI పరిశోధనలకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దానిపై అతిగా ఆధారపడటం వల్ల నిజమైన అభ్యాసం కుంటుపడుతుందని గౌరవ్ చౌదరి అన్నారు.
కనీసం నిర్ణయాలైనా స్వంతంగా తీసుకోవాలి
రాధిక గుప్తా మాట్లాడుతూ.. విద్యార్థులు AI-జనరేటెడ్ సమాధానాలను గుడ్డిగా విశ్వసించే బదులు తమంతట తాముగా ఆలోచించుకోవాలని, కనీసం నిర్ణయాలైనా స్వంతంగా తీసుకోవాలని కోరారు. స్వతంత్ర నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవడం పరీక్షలకు మించి విజయానికి కీలకమని పేర్కొన్నారు.
పరీక్షలకు AI ని తెలివిగా ఉపయోగించుకోవాలి
టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించినట్లయితే పరీక్షల సమయంలో AI బలేగా సహాయపడుతుందని రాధిక గుప్తా అన్నారు. చేయవలసిన పనుల జాబితాలను తయారు చేయడం, అధ్యయన పురోగతిని ట్రాక్ చేయడం, AI-ఆధారిత ప్లానర్‌లను ఉపయోగించడం వంటి సాధారణ వ్యూహాలు ఉత్పాదకతను పెంచుతాయి. అయితే విద్యార్థులు చదువుకునే సమయంలో వినోదం కోసం సాంకేతికతను అతిగా ఉపయోగించకుండా జాగ్రత్త పడాలని అన్నారు.
టెక్నాలజీని దాటి జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి
టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి మాట్లాడుతూ.. విద్యార్థులు స్క్రీన్‌లకు దూరంగా జీవితాన్ని అనుభవించాలని గుర్తు చేశారు. డిజిటల్ సాధనాలు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, అవి నిజ జీవిత పరస్పర చర్యలను, వ్యక్తిగత వృద్ధిని భర్తీ చేయకూడదని అన్నారు. టెక్నాలజీ నుంచి విరామం తీసుకోవడం వల్ల మనస్సు విశ్రాంతి పొంది మెరుగ్గా పనిచేస్తుందని సూచించారు. ఏఐ మన జీవితాలకు శత్రవు కాదని, అయితే దానిని సరైన మార్గంలో వినియోగించినప్పుడే ఫలితం ఉంటుందని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.