AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TET Exam Postponement: టెట్‌ పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్లు.. కారణం ఇదే!

Telangana TET Exam likely to be postponed: సుప్రీంకోర్టు ఆగస్టు 31న ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ భయం పట్టుకుంది. టెట్‌ పాస్‌కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తున్నది. దీంతో వచ్చే 2 ఏళ్లలో టెట్‌ గట్టెక్కే పనిలో పడ్డారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే స్పెషల్‌ కోచింగ్‌ తీసుకుంటున్నా పరిస్థితి అనుకూలించడంలేదు. ఇప్పటికే..

TET Exam Postponement: టెట్‌ పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్లు.. కారణం ఇదే!
Telangana TET Exam likely to be postponed
Srilakshmi C
|

Updated on: Dec 05, 2025 | 8:13 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5: సుప్రీంకోర్టు ఆగస్టు 31న ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ భయం పట్టుకుంది. టెట్‌ పాస్‌కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తున్నది. దీంతో వచ్చే 2 ఏళ్లలో టెట్‌ గట్టెక్కే పనిలో పడ్డారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే స్పెషల్‌ కోచింగ్‌ తీసుకుంటున్నా పరిస్థితి అనుకూలించడంలేదు. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు ముగియడంతో టెట్‌ కోసం సన్నద్ధత ప్రారంభించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రిపరేషన్‌కు మళ్లీ బ్రేక్‌ పడింది. మరోవైపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. వీటన్నింటిని అధిగమించి టెట్‌ పాస్‌కావడం ఉపాధ్యాయులకు కత్తి మీద సాముగా మారింది. టెట్‌ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి మూడు నుంచి టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరనున్నాయి. ఈసారి ఇన్‌సర్వీస్‌ టీచర్లను కూడా టెట్‌ రాసేందుకు అనుమతించడంతో. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 71వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. సర్కారీ స్కూళ్ల టీచర్లతోపాటు మోడల్‌ స్కూల్‌, గురుకుల టీచర్లు, కేజీబీవీ బోధనా సిబ్బంది టెట్‌ కోసం దరఖాస్తు చేశారు. డీఈఎల్‌డీతోపాటు బీఈడీ అర్హతతో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైనవారు పేపర్‌ 1 పరీక్షకు, భాషాపండితులు, హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు పేపర్‌ 2 పరీక్షకు సన్నద్ధం కావల్సి ఉంటుంది. దీంతో సీరియస్‌గా టెట్‌ ప్రిపేర్‌ అవుదామని టీచర్లు పుస్తకాలు పట్టే తరుణంలో పంచాయితీ ఎన్నికల డ్యూటీలు పడటంతో కంగారు పడుతున్నారు. మరోవైపు పదో తరగతి పరీక్షలు ముంచుకొస్తున్నాయి.

విద్యార్ధులకు మిగిలిన సిలబస్‌ను పూర్తిచేయడంతోపాటు స్పెషల్‌ క్లాసులు తీసుకోవాలి. స్లిప్‌టెస్టులు, వీక్లీ టెస్టులు పెట్టాలి. వాటిని దిద్దాలి. తప్పులు సరిచేయాలి. చదువులో వెనకబడిన విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలి. ఇన్ని బాధ్యతల నడుమ టీచర్లు సెలవులు పెట్టలేని పరిస్థితి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒ క్కో టీచర్‌ 10 నుంచి 15 రోజులు ఎన్నికల విధుల్లోనే గడపాల్సి వస్తుంది. ఎన్నికల విధుల్లో ఉన్న వారికి 2 రోజులు ట్రైనింగ్‌ కూడా ఉంటుంది. ఇవికాకుండా ఎన్నికల సామగ్రిని స్వీకరణ, పోలింగ్‌, కౌంటింగ్‌, మిగిలిన సామగ్రిని సమర్పించేందుకు ఇలా మొత్తంగా మూడు నుంచి నాలుగు రోజులు దీనికే సరిపోతుంది. ఎన్నికల తతంగం డిసెంబర్‌ 17వ తేదీతో ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి

జనవరి 3 నుంచి 31 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఎన్నికలు ముగిసిన 15 రోజుల తర్వాత టెట్‌ పరీక్షలు జరుగుతాయి. ఇంత తక్కవ సమయంలో సన్నద్ధం కావడం టీచర్లకు సవాలుగా మారింది. ఈ క్రమంలో టెట్‌ పరీక్షలు వాయిదావేయాలని తెలంగాణ స్కూల్స్‌ టెక్నికల్‌ కాలేజీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ విజ్ఞప్తి చేసింది. అలాగే పోలింగ్‌ తేదీ 11,14,17 తేదీల్లో జరగాల్సిన ఉస్మానియా, జేఎన్టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఎన్నికల సంఘం సీఈవోకు వినతిపత్రం సమర్పించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.