సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి హఠాన్మరణం! సొంత ఇంట్లోనే శవమై..
పలు కొరియన్ డ్రామాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న నటి కిమ్ సే రాన్ (24) అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లోనే మృతి చెంది కనిపించింది. దక్షిణ కొరియాకు చెందిన నటి కిమ్ సే రాన్ ఆదివారం మృతి చెందినట్లు ఆ దేశ వార్త సంస్థలు దృవీకరించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటి మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు..

‘లిజెన్ టు మై హార్ట్’, ‘ది క్వీన్స్ క్లాస్‌రూమ్’, ‘హాయ్! స్కూల్-లవ్ ఆన్’ వంటి పలు కొరియన్ డ్రామాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న నటి కిమ్ సే రాన్ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. దక్షిణ కొరియాకు చెందిన నటి కిమ్ సే రాన్ తన నివాసంలో ఆదివారం (ఫిబ్రవరి 16) శవమై కనిపించింది. ఆదివారం నటి కిమ్ సే రాన్‌ను కలిసేందుకు ఆమె ఇంటికి వచ్చిన స్నేహితుడు.. ఇంట్లో నటి నేలపై పడిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించి చూడగా.. అప్పటికే ఆమె మృతి చెంది కనిపించింది. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నటి మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు కొరియా హెరాల్డ్ పేర్కొంది.
మరోవైపు నటి కిమ్ సే రాన్ ఆకస్మిక మరణ వార్త దక్షిణ కొరియా సిఈ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నటి సహనటీనటులు, స్నేహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కిమ్ సే రాన్ మృతి పట్లు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా 2000 జూలై 31న జన్మించిన కిమ్ సే-రాన్ తొమ్మిదేళ్ల వయసులో నటనలోకి ప్రవేశించింది. ‘ఎ బ్రాండ్ న్యూ లైఫ్’ (2009), ‘ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్’ (2010) వంటి పలు పాపులర్ మువీల్లో బాలనటిగా ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఇక టీనేజ్‌లోకి వచ్చాక కిమ్ ‘ఎ గర్ల్ ఎట్ మై డోర్’ (2014), టీవీ సిరీస్ ‘సీక్రెట్ హీలర్’ (2016) వంటి ప్రముఖ ప్రాజెక్టులలో కీలక పాత్రల్లో నటించింది. అయితే కిమ్ తొలినాళ్లలో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నప్పటికీ ఇటీవల కాలంలో కెరీర్ పరంగా, వ్యక్తి గతంగా కొంత ఒడిదుడుకులకు గురైంది.
మే 2022లో హై ప్రొఫైల్ ఏరియాలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో చాలా డబ్బు పోగొట్టుకుంది. ఇక ఆ తర్వాత కిమ్ బహిరంగ క్షమాపణలు చెప్పింది కూడా. కానీ ఈ సంఘటన తర్వాత కిమ్‌కు పెద్దగా సినీ అవకాశాలు రాలేదు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా చేయాల్సి వచ్చింది. తిరిగి తన సినీ కెరీర్‌ను నిర్మించుకోవడాకి ఎంతో కష్టపడిన కిమ్.. చివరకు మే 2024లో ఓ కొరియన్ డ్రామాలో ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా దానినీ చేజార్చుకుంది. 2023లో విడుదలైన ‘బ్లడ్‌హౌండ్స్’లో కిమ్ చివరిసారిగా నటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.