AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కపిల్ దేవ్ బౌలింగ్‌కు పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు పారిపోవాలి.. సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు..

యూపీ ఆరోగ్య రంగంలో మరో ముందడుగు పడింది. గ్రేటర్ నోయిడా నివాసితులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తూ రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రిని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ ఆటతో వైద్యుల పనితీరును ముడిపెడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కపిల్ దేవ్ బౌలింగ్‌కు పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు పారిపోవాలి.. సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు..
Cm Yogi Adityanath Inaugurates Kdsg Super Specialty Hospital
Krishna S
|

Updated on: Mar 06, 2026 | 10:54 AM

Share

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాద్రి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన KDSG సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, ఎంపీ మహేష్ శర్మ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం సీఎం వైద్యులతో ఆరోగ్య సేవల నాణ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. వైద్యులు, రోగుల మధ్య ఉండాల్సిన నమ్మకాన్ని క్రికెట్ ఉదాహరణతో వివరించారు. ‘‘కపిల్ దేవ్ మైదానంలోకి అడుగుపెడితేనే పాకిస్థాన్ జట్టు సగం ఓడిపోయినట్లు భావించేది. అదేవిధంగా వైద్యులు ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వుతో చికిత్స అందిస్తే రోగి సగం అనారోగ్యం ఆ క్షణమే నయమవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. మందులతో పాటు ప్రార్థనలు తోడైతే రోగులు త్వరగా కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వైద్య రంగంలో యూపీ విప్లవాత్మక మార్పులు

రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధిని వివరిస్తూ సీఎం కీలక గణాంకాలను వెల్లడించారు. 2017 వరకు యూపీలో కేవలం 17 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా ఒక జిల్లా – ఒక మెడికల్ కాలేజీ విధానంతో ప్రస్తుతం వాటి సంఖ్య 81కి చేరిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 60 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తున్న ఈ పథకం కింద.. యూపీలోనే ఇప్పటివరకు 5 కోట్లకు పైగా గోల్డెన్ కార్డులు జారీ చేశారని అన్నారు. 2014 వరకు దేశంలో కేవలం 6 ఎయిమ్స్ సంస్థలు ఉండగా నేడు ఆ సంఖ్య 23కి పెరిగిందని ఆయన గుర్తు చేశారు.

KDSG ఆసుపత్రి ప్రత్యేకతలు

దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. 300 పడకల సామర్థ్యం, కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ విభాగాల్లో అధునాతన చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఆసుపత్రి ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 1,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

ఫీజుల విషయంలో సీఎం సూచన

ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తూనే, ఆసుపత్రి ఫీజులు సామాన్యులకు అందుబాటులో ఉండాలని సీఎం యోగి సూచించారు. ప్రభుత్వ రేట్లకు, ప్రైవేట్ ఫీజులకు మధ్య సమతుల్యత పాటిస్తేనే పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ఆసుపత్రి ద్వారా ఆరోగ్య సంరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతామని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us