AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

హైదరాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. సైబరాబాద్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, డ్రెయిన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆ రూట్‌లో 20 రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారులు వెల్లడించారు. కాబట్టి హఫీజ్‌పేట్, కొండాపూర్, మై హోమ్ మంగళా వైపు వెళ్లే వాహనదారులు ఈ ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణించాలని సూచించారు.

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
Hyderabad Traffic Updates Today
Anand T
|

Updated on: Jul 16, 2026 | 8:13 AM

Share

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతూనే ఉన్నారు. ఈ పనుల కారణంగా కొన్నిసార్లు నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుంటాయి. అయితే అధికారులు వీటికి ప్రత్యామ్నాయ సూచనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నగరవాసులకు సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు మరోసారి ట్రాఫిక్ మళ్లింపు సూచనలు చేశారు. రోడ్డు విస్తరణ, డ్రెయినేజ్ నిర్మాణం కారణంగా సైబరాబాద్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్‌ను నేటి నుంచి, అనగా 16వ తేదీ నుంచి 20 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైశాలీనగర్ అండర్‌పాస్‌లో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన అధికారులు, అక్కడ రోడ్డు విస్తరణ, డ్రెయిన్ నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఈ మేరకు పనులు పూర్తయ్యే వరకు ఈ అండర్‌పాస్ మీదుగా రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే ఈ రూట్‌లో ప్రయాణించే వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం:

హఫీజ్‌పేట్ వైపు వెళ్లేవారు: మై హోమ్ మంగళా, తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ నుంచి హఫీజ్‌పేట్ వైపు వెళ్లే వాహనాలు.. మై హోమ్ మంగళా టీ జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుని రాఘవేంద్ర నగర్ కాలనీ, హైటెన్షన్ రోడ్, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం మీదుగా హఫీజ్‌పేట్ ఆర్ఓబీ (ROB) ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

మై హోమ్ మంగళా వైపు వెళ్లేవారు: హఫీజ్‌పేట్, ఆర్టీసీ కాలనీ, మై హోమ్ జువెల్, వాసవి లేక్ సిటీ, హఫీజ్‌పేట్ లేక్, గోపాల్‌నగర్, కాల్వరీ టెంపుల్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు.. మంజీరా పైప్‌లైన్ రోడ్ లేదా హఫీజ్‌పేట్ ఆర్ఓబీ (ROB) మీదుగా జెన్‌పాక్ట్ జంక్షన్ చేరుకుని, అక్కడి నుంచి కొండాపూర్ ఆల్విన్ రోడ్ ద్వారా మై హోమ్ మంగళా, రాఘవేంద్ర నగర్ వైపు వెళ్లాలని సూచించారు.

ఈ ట్రాఫిక్ మళ్లింపుల నేపథ్యంలో వాహనదారులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణ పనుల వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కాబట్టి వాహనదారులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us