Chicken Price Today: చికెన్ ధరలు ఢమాల్.. వెలవెల బోతున్న మాంసం షాప్‌లు
బర్డ్ ఫ్లూ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కోళ్లు రోజుకు వేలాదిగా మరణిస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బర్డ్ ఫ్లూ సోకి దాదాపు ఐదున్నర లక్షల కోళ్లు చనిపోయాయి. ఇక తెలంగాణలోనూ వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. కోళ్లకేకాకుండా మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో చికెన్ పేరెత్తితేనే జనాలు హడలెత్తిపోతున్నారు. దీంతో ఈ రోజు ఆదివారం కావడంతో కొనేవాళ్లులేక మాంసం దుఖాణాలు వెలవెలబోతున్నాయి..

రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ఎక్కడికక్కడ కోళ్లు కుప్పలు తెప్పలుగా మృతి చెందుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బర్డ్ ఫ్లూ సోకి దాదాపు ఐదున్నర లక్షల కోళ్లు చనిపోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలోనూ వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. కోళ్లకేకాకుండా మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో జనాల్లో ఆందోళన నెలకొంది. దీంతో అటు ఏపీతోపాటు ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో చికెన్ తినటంపై నిషేదం విధించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమై పౌల్ట్రీ వాహనాలను సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిలిపివేస్తోంది. అంతేకాకుండా పొరుగురాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వస్తున్న కోళ్లు, బాతుల వాహనాలను అడ్డుకొని తిరిగి వెనక్కి పంపుతున్నారు. ఎక్కడైనా కోళ్లు అనారోగ్యంతో మరణిస్తే వెంటనే సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9100797300 విడుదల చేశారు. చనిపోయిన కోళ్లను అడ్డగోలుగా పడేయకుండా సురక్షితంగా పూడ్చిపెట్టాలని అధికారులు సూచించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో శనివారం తెల్లవారుజామున ఒకేసారి 800 కోళ్లు మృతి చెందాయి. ఈ కోళ్లఫారంను నేలపట్లకు చెందిన శివ అనే వ్యక్తి కొంతకాలంగా లీజుకు తీసుకుని నడుపుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న మండల పశువైద్యాధికారి పృథ్వీరాజ్ ఫారం వద్దకు చేరుకుని మరణించిన కోళ్లకు పరీక్షలు నిర్వహించారు. చనిపోయిన కోళ్లకు బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని, మరేదైనా వైరస్ వల్ల చనిపోయి ఉంటాయని తెలిపారు. పౌల్ట్రీ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో కోళ్ల ఫాం నిర్వాహకులు మృతి చెందిన కోళ్లను భూమిలో పాతిపెట్టారు. కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోయానని నిర్వాహకుడు శివ కన్నీరు పెట్టుకున్నాడు.
వీటన్నింటి దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్ విక్రయాలు తగ్గాయి. ధరలు కూడా పాతాలానికి పడిపోయాయి. బర్డ్ ప్లూ భయంతో అసలు చికెన్ కొనేవారే కరువయ్యారు. దీంతో ఈ రోజు ఆదివారం అయినప్పటికీ చికెన్ మార్కెట్లన్నీ ఖాళీగా వెలవెలబోతుంది. గతంలో కిలో రూ.300 పలికిన చికెన్ ప్రస్తుతం రూ.150కి చేరింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్ కు వచ్చే కోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దీంతో మాంసం ప్రియులు కాస్త ధర ఎక్కువైనా మటన్ వైపు పరుగులు తీస్తున్నారు. మరికొందరు చేపలు, రొయ్యల కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో ఈ రోజు ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలలాడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.