Bullet Bike: దళిత విద్యార్ధి బుల్లెట్ నడిపాడనీ.. రెండు చేతులు నరికేశారు! ఎక్కడంటే..
నాడు దళితులు చెప్పులు వేసుకున్నా, ఒంటి నిండా బట్టకట్టుకున్నా, పలక పట్టినా.. అంతెందుకు రోడ్డుపై నడిచినా పురుగును నలిపినట్లు నలిపారు. నేటికీ ఈ దురాచారాలు కొన్ని ప్రాంతాల్లో సజీవంగా ఉన్నయనడానికి ఈ ఘటనే ఆధారం. ఓ దళిత విద్యార్ధి బుల్లెట్ బైక్ నడిపాడన్న కారణంతో అతడి చేతులు నరికేసి మీసం మెలేశారు ఆ ఊరి అగ్రవర్ణం పశువులు..

శివగంగ, ఫిబ్రవరి 15: రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 వసంతాలు పూర్తి చేసుకున్న దేశంలో వేళ్లూనుకుపోయిన దురాచారాల వాసన ఇంకా పూర్తిగా వదలలేదు. ఇంకా దళితుల పట్ల అగ్రవర్ణాలు అమానుష చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. నిత్యం ఏదో మూల అలజడి.. అమానుష దాడులు జరుగుతూనే ఉన్నాయి. నాడు దళితులు చెప్పులు వేసుకున్నా, ఒంటి నిండా బట్టకట్టుకున్నా, పలక పట్టినా.. అంతెందుకు రోడ్డుపై నడిచినా పురుగును నలిపినట్లు నలిపారు. నేటికీ ఈ దురాచారాలు కొన్ని ప్రాంతాల్లో సజీవంగా ఉన్నయనడానికి ఈ కింది ఘటనే ఆధారం. తాజాగా ఓ దళిత విద్యార్ధి బుల్లెట్ బైక్ నడిపాడన్న కారణంతో అతడి చేతులు నరికేసి మీసం మెలేశారు ఆ ఊరి అగ్రవర్ణం పశువులు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మానామదురై సమీపంలో గురువారం (ఫిబ్రవరి 13) జరిగింది. అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మానామదురై సమీపంలో మేళపాలయంకు చెందిన రామన్, చెల్లమ్మ దంపతుల కుమారుడు అయ్యాస్వామి. అతడు శివగంగైలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొన్నాళ్ల క్రితం తండ్రి మరణంతో చిన్నాన్న భూమినాథన్ పంచన ఉంటూ అయ్యా స్వామి చదువు కొనసాగిస్తున్నాడు. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినప్పటికీ చిన్నాన్న ఆర్ధికంగా కాస్త ఉన్న వ్యక్తి కావడంతో అతడు బుల్లెట్ బండి కొనుగోలు చేశాడు. దీనిపైనే అయ్యాస్వామి తరచూ కాలేజీకి వెళ్లేవాడు.
అయితే తక్కువ కులానికి చెందిన అయ్యస్వామి తమ కళ్ల ముందే బుల్లెట్ బైక్‌పై తిరగడం ఆ గ్రామంలోని అగ్రవర్ణానికి చెందిన చెందిన కొందరికి కంటగింపుగా మారింది. ఈ క్రమంలో గురువారం ఉదయం కాలేజీకి బుల్లెట్‌పై వెళ్తున్న అయ్యాస్వామిని.. ఆర్ వినోద్‌కుమార్ (21), ఎ అతీశ్వరన్ (22), ఎం వల్లరసు (21) అనే ముగ్గురు అగ్రవర్ణ యువకులు అడ్డగించి కత్తులతో దాడి చేశారు. అయ్యస్వామి రెండు చేతులను నరికి.. ‘అగ్రవర్ణాల వాళ్లు మాత్రమే ఖరీదైన వాహనాలు నడపాలి. దళితులు వీటిని నడపడానికి వీల్లేదు’ అని వార్నింగ్ ఇచ్చి నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. దీంతో భయపడిపోయిన అయ్యస్వామి వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరాడు. వెంటనే కుటుంబ సభ్యులు అయ్యసామిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రామంలో చాలా కాలంగా కుల వివక్షత బలంగా ఉందని, తమ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని బాధిత కుంటుంబం డిమాండ్ చేసింది. అయ్యసామి చిన్నాన మాట్లాడుతూ.. తమ గ్రామంలో ‘బుల్లెట్’ బైక్ నడపడం పట్ల అగ్రవర్ణాల వాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, గతంలో ఒకసారి తన బైక్‌ను పాడు చేశారని తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం అయ్యస్వామిపై దాడికి బుల్లెట్ కారణం కాదని ఖండించారు. గతంలోనే వీరిమధ్య మనస్పర్ధలున్నాయని, పాత కక్షల వల్లనే దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దాడి చేసిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








