AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. ఖాళీ కడుపుతో అరటిపండ్లు, ఖర్జూరాలు, ఆపిల్స్, నానబెట్టిన బాదంపప్పు, గుడ్లు వంటి పోషకాహారాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి దీర్ఘకాల శక్తిని అందించి, రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని రోజంతా చురుగ్గా ఉంచుతాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
Healthy Breakfast
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2026 | 3:02 PM

Share

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. అయితే ఆ బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యకరమైనదైతే మరింత మంచిది. పౌష్టికాహారం దీర్ఘకాలం శక్తిని అందిస్తుంది. గంటల తరబడి మిమ్మల్ని పూర్తి శక్తితో ఉంచుతుంది. మంచి ఆహారం సాధారణంగా ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుంది. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు మీ కడుపు, పేగు, మొత్తం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఉదయం ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండ్లు:  ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అవసరమైనంత మేర ఉన్న అరటిపండ్లు మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పొచ్చు. ఉదయాన్నే రెండు అరటి పండ్లు తినడం వల్ల మీరు రోజును అధనపు శక్తితో ప్రారంభించవచ్చు. బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నప్పుడు అరటిపళ్లలోని కార్బోహైడ్రేట్లు ఎనర్జీ బూస్టర్స్‌గా పనిచేస్తాయి. అదనంగా అరటిపళ్లలో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ మనల్ని రిలాక్స్‌గా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి అల్పాహారానికి ముందు అరటి పండు తింటే మంచిదంటున్నారు నిపుణులు. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పరగడపున అరటి తినకపోవడమే మంచిది.

ఖర్జూరం: ఖర్జూరం మీ రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్వీట్‌గా చెప్పొచ్చు. సరైన ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడే అన్ని రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాల్లో కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, సోడియం మొదలైన ఖనిజాలు, విటమిన్లు A, B1, B2, C సమృద్ధిగా ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించొచ్చు. కరోనరీ హార్ట్ డిసీస్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆపిల్స్: విటమిన్ A, B, C, E, K, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు ఆపిల్స్‌లో పుష్కలంగా లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆపిల్‌ను తింటే ఎక్కువ లాభాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందులో ఉండే విటమిన్ సి ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే చాలా మేలని అంటున్నారు. గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది. అంతేకాదు ఖాళీ కడుపుతో ఆపిల్ ను తింటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శరీరం రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది.

బాదంపప్పు: బాదంపప్పులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. బాదంపప్పును సలాడ్ రూపంలో పచ్చిగా కూడా తినొచ్చు. లేదంటే ప్రొటీన్ షేక్‌లో యాడ్ చేసుకున్నా సరే. మీరు కాఫీకి ప్రత్యామ్నాయంగా బాదం పాలను కూడా తాగొచ్చు. విటమిన్ E, ప్రొటీన్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మాంగనీస్, ఫైబర్‌తో నిండిన బాదం మీకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. కానీ వాటిని రాత్రంతా నానబెట్టిన తర్వాత తినడం మంచిది.

గుడ్లు: గుడ్లు సహజంగా లభించే ఇతర ఆహారాల కంటే ఎక్కువ ప్రొటీన్లు కలిగి ఉంటాయి. ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. కాబట్టి బరువు తగ్గేందుకు ఇదొక గుడ్ ఆప్షన్. గుడ్లలో ఐరన్, విటమిన్ డి, పొటాషియం, జింక్ ఉంటాయి. ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి.

ముఖ్య విషయం ఏంటంటే వీటిని మీరు ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలు పాటించాల్సిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. 

Follow Us