బ్రహ్మం గారి కాలజ్ఞానంలో లేదు కానీ.. సీబీఐ ఆఫీసులో కూడా దొంగలు పడ్డారు..!
గజ దొంగలను దడదడ లాడించే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారుల కార్యాలయానికే కన్నం వేశాడో గరానా దొంగ. అర్ధరాత్రిపూట గుట్టుగా సీబీఐ ఆఫీస్‌లోకి దూరి అంతా వెతికాడు. చెక్కలు, బల్లలు, కుర్చీలు తప్ప అక్కడ ఏం లేకపోవడంతో ఖంగుతిన్నాడు. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నాడో ఏమో.. గదిలోని బీరువాలు, డోర్లు, కిటికీలతో సహా ఫర్నీచర్ మొత్తాన్ని సర్దేశాడు..

అగర్తలా, ఫిబ్రవరి 14: ఓ దొంగ గారు చిన్న చిన్న లూటీలు చేస్తే ఏం వస్తుందిలే అనుకున్నట్లు ఉన్నాడు.. ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కార్యాలయానికే కన్నం వేశాడు. అందరూ వెళ్లిపోయాక అర్ధరాత్రిపూట గుట్టుగా సీబీఐ ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తీరా లోనికి వచ్చాక చూస్తే.. చక్కలు, బల్లలు, కుర్చీలు తప్ప అక్కడ ఏం లేకపోవడంతో ఖంగుతిన్నాడు. ఊరికే వెళ్లడం ఎందుకనుకున్నడో ఏమో.. గదిలోని బీరువాలు, డోర్లు, కిటికీలతో సహా ఫర్నీచర్ మొత్తాన్ని లారీ ఎక్కంచేశాడు. ఒట్టి గోడలు మినహా వస్తువులేవీ లేకుండా శుభ్రంగా ఊడ్చేసి పరారయ్యాడు. మరునాడు ఉదయం ఆఫీస్‌కి వచ్చిన సీబీఐ అధికారులు గది ఖాళీగా ఉండటం చూసి పరేషానయ్యారు. ఈ విచిత్ర ఘటన త్రిపురలోని అగర్తలాలో ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) క్యాంప్ ఆఫీస్‌లో ఫిబ్రవరి 11న చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
త్రిపుర రాజధాని అగర్తలాలో శ్యామలీ బజార్ క్వార్టర్ కాంప్లెక్స్‌లోని సీబీఐ క్యాంప్ ఆఫీస్ ఉంది. అయితే అది గత ఐదు నెలలుగా మూసి ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 11న సీబీఐ అధికారులు ఆఫీస్‌కి వచ్చారు. అయితే అత్యంత భద్రత ఉండే క్యాంప్ ఆఫీస్ ఖాళీగా ఉండటం చూసి ఖంగుతిన్నారు. అందులోని వస్తువులు, ఫర్నీచర్ మాయం అయ్యాయి. గదిలోని స్టీల్ బీరువాలు, కుర్చీలు, విద్యుత్ పరికరాలేకాకుండా గది తలుపులు, కిటికీలు ఎత్తుకెళ్లడంతో అది దొంగల పనేనని అనుమానించారు. అనంతరం సీబీఐ ఇన్‌స్పెక్టర్ అనురాగ్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. బిప్లాబ్ దేబ్బర్మ, రాజు భౌమిక్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. అనంతరం శ్యామలీ బజార్, ఖేజుర్ బగన్ ప్రాంతాలకు చెందిన మరో నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 8 స్టీల్ బీరువాలు, 7 చెక్క కుర్చీలు, నాలుగు కుర్చీలు, నాలుగు కిటికీలు, ఒక గీజర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను త్వరలో కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దొంగతనం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఖైదీలలో కొంతమంది మాదకద్రవ్యాల బానిసలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు .
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.