Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మా.. నాన్న.. క్షమించండి! మీ కల నెరవేర్చలేకపోయా..: జేఈఈ మెయిన్ విద్యార్ధిని సూసైడ్‌ లేఖ కలకలం

పరీక్ష కాలం వచ్చేసింది. కోటి ఆశలతో పరీక్షలు రాసే విద్యార్ధులు ఏదైనా తడబాటుకు గురై అందులో తప్పిదే.. చావే శరణ్యంగా భావించే కాలం ఇది. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయినందుకు ఓ ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుని కన్నోళ్లకు తీరని వేదన మిగిల్చింది. ఆత్మహత్యకు ముందు విద్యార్ధిని రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది..

అమ్మా.. నాన్న.. క్షమించండి! మీ కల నెరవేర్చలేకపోయా..: జేఈఈ మెయిన్ విద్యార్ధిని సూసైడ్‌ లేఖ కలకలం
JEE Aspirant suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 13, 2025 | 6:37 PM

గోరఖ్‌పూర్, ఫిబ్రవరి 13: ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఓ ఇంటర్ విద్యార్ధిని అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆత్మహత్యకు ముందు విద్యార్ధిని రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని కాంట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మొమెంటం కోచింగ్ సెంటర్‌కి చెందిన విద్యార్థిని అదితి మిశ్రా (18) గత రెండేళ్లుగా జేఈఈ మెయిన్‌కి కోచింగ్‌ తీసుకుంటుంది. అక్కడే సత్యదీప్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటూ క్లాస్‌లకు హాజరయ్యేది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవగా.. అందులో అదితి ఫెయిల్‌ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అదితి ఫలితాలు విడుదలైన ఒకరోజు తర్వాత అంటే బుధవారం మధ్యాహ్నం హాస్ట్‌లో గదిలో సూసైడ్‌కు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు అదితి బుధవారం ఉదయం తల్లిదండ్రులతో కూడా మాట్లాడింది. తండ్రిని తన మొబైల్‌కి రీఛార్జ్‌ చేయమని కోరినట్లు రూంమెట్‌ తెల్పింది. అయితే తాను జేఈఈ మెయిన్స్‌ క్లియర్‌ చేయలేదన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని తండ్రిని కోరిందని, బయటికి వెళ్లి వచ్చే సరికి అదితి ఎంతకూ గది తలుపులు తీయలేదు. దీంతో హాస్టల్ వార్డెన్ కు సమాచారం అందించగా.. వారొచ్చి తలుపులు పగలగొట్టేటప్పటికే ఆలస్యమైంది. గదిలో అదితి ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. అనంతరం హాస్టల్ వార్డెన్ పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గదిలోని సూసైడ్ నోట్‌ను స్వాదీనం చేసుకున్నారు. జేఈఈ తక్కువ మార్కులు వచ్చినందున తల్లిదండ్రుల కలలను తాను సాధించలేకపోయానని, అందుకు తల్లిదండ్రులకు క్షమాపణలు కోరుతున్నట్లు అందులో పేర్కొంది. క్షమించండి.. అమ్మా, నాన్న. దయచేసి నన్ను క్షమించండి. నేను సాధించలేకపోయాను. మన ఉమ్మడి ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. ఏడవకండి. మీరిద్దరూ నాకు అపారమైన ప్రేమను ఇచ్చారు. నేను మీ కలలను నెరవేర్చుకోలేకపోయాను. మీరు దయచేసి చోటీ (చెల్లె్లు)ని జాగ్రత్తగా చూసుకోండి. చెల్లి ఖచ్చితంగా మీ కలలను నెరవేరుస్తుంది. మీ ప్రియమైన కుమార్తె – అదితి’ అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. రెండు రోజుల క్రితమే తమ కుమార్తె హాస్టల్‌కు తిరిగి వచ్చిందని.. కూతురి చివరి మాటలను గుర్తు చేసుకుంటూ అదితి తండ్రి తల్లడిల్లిపోయాడు. జేఈఈ మెయిన్‌ పరీక్షలో ఫెయిల్ అయినందుకు బాధపడొద్దని, తదుపరి ప్రయత్నానికి సిద్ధం కావాలని ప్రోత్సహించానని, ఇంతలో ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయానని గుండెలు బాదుకుంటూ రోధించాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.