Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiration Story: ఒకే స్టేషన్‌లో గురువు కానిస్టేబుల్‌.. శిష్యురాలు ఎస్సై..! వీరి స్ఫూర్తిదాయక ప్రయాణం మీరూ తెలుసుకోండి

ఓ వైపు అడుగుడుగునా వెక్కిరించే పేదరికం.. మరోవైపు బంధువుల సాధింపులు.. వెరసి ఓ యువతి వీడని పట్టుదలతో సర్కార్ కొలువు దక్కించుకుని అందరినీ అబ్బురపరిచింది. తనకు కాలేజీలో పాఠాలు చెప్పి, వెన్నంటే ఉండి అడుగడుగున ప్రోత్సహించిన తన గురువు పని చేసే స్టేషన్‌లోనే ఎస్సైగా అడుగు పెట్టడంతో.. ఆ గురువు ఆనందానికి అవధులు లేకుండ పోయాయి. వీరి స్ఫూర్తి దాయక కథ మీరూ తెలుసుకోండి..

Inspiration Story: ఒకే స్టేషన్‌లో గురువు కానిస్టేబుల్‌.. శిష్యురాలు ఎస్సై..! వీరి స్ఫూర్తిదాయక ప్రయాణం మీరూ తెలుసుకోండి
Inspiring Story Of Teacher And Student
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 07, 2025 | 7:59 PM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఒకే పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులుగా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు, విద్యార్ధి స్ఫూర్తిదాయకమైన కథ ఇది. ఈ ఫొటోలో ఎస్సైగా యూనిఫాంలో ఉన్న యువతి పేరు జబీనాబేగం. పక్కన నిలబడింది అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లాల్యానాయక్‌. అయితే వీళ్లిద్దరూ గురుశిష్యులు కావడం విశేషం. అవును.. కానిస్టేబుల్‌ లాల్యానాయక్‌ వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థిని జబీనాబేగం ఎస్సై కొలువు సాధించి.. గురువు విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ స్టేషన్‌లో ఆయనకే పైఅధికారిగా రావడం విశేషం. ఇద్దరూ పేదరికాన్ని దాటి తమ కలల కొలువును దక్కించుకున్నవారే.

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్‌ లాల్యానాయక్‌ది నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి నాలుగో తరగతిలో పరిగిలోని ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించడంతో అక్కడే ఆయన ఇంటర్‌ వరకు చదివారు. తర్వాత పాల్వంచలో డిగ్రీ, ఎంఏ, బీఎడ్‌ పూర్తిచేసి.. అనంతరం పరిగిలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. కొవిడ్‌ సమయంలో కళాశాల మూతపడింది. దీంతో ఆయన ఉపాధి కోల్పోయారు. పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం లాల్యానాయక్‌ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

పరిగిలోని ప్రైవేటు జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో జబీనాబేగం అనే విద్యార్ధిని ఇంటర్‌ చదువుతుంది. చదువులో చురుగ్గా ఉండే జబీనాబేగంను ఆయన ఎంతో ప్రోత్సహించారు. అయితే ఇంటర్ సెకండియర్‌ చదువుతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు బలవంతంగా వివాహం జరిపించేందుకు ప్రయత్నించగా..లాల్యానాయక్‌ ఆ పెళ్లి రద్దు చేయింది, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, ఇంటర్‌, ఆ తర్వాత డిగ్రీ చదివేవరకు అండగా నిలిచారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకూ చేదోడుగా నిలిచి ప్రోత్సహించారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోలీస్‌ నియామకాల్లో జబీనాబేగం 2024లో ఎస్సైగా ఎంపికైంది. అనంతరం ఏడాది శిక్షణ ఇటీవల పూర్తికాగా.. ఎస్సైగా (ప్రొబేషన్‌) మొయినాబాద్‌ పోలీసుస్టేషన్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. అక్కడ తన శిష్యురాలు జబీనాబేగం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించేందుకు రావడంతో లాల్యానాయక్‌..ప్రధాన ద్వారం వద్ద సెల్యూట్‌ చేసి స్వాగతం పలికారు. వీరి ఆనంద క్షణాలు చూపరులను కండతడి పెట్టించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.