AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immigration Act: వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. కీలక చట్టం యోచనలో కేంద్రం!

వీసా-పాస్‌పోర్ట్ లేకుండా భారతదేశంలోకి ప్రవేశించడంపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతోంది. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా ఒక విదేశీయుడు భారతదేశంలోకి ప్రవేశిస్తే, అతనికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష తోపాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

Immigration Act: వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. కీలక చట్టం యోచనలో కేంద్రం!
Immigration Bill India
Balaraju Goud
|

Updated on: Feb 13, 2025 | 5:43 PM

Share

వీసా, పాస్‌పోర్ట్ లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే వారికి త్వరలో కఠినమైన శిక్షలు తప్పవు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కేంద్ర సర్కార్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు ఉందని పేర్కొంటూ ఒక విదేశీ పౌరుడు భారతదేశంలోకి ప్రవేశించడాన్ని నిరోధించడం ఇదే మొదటిసారి. ఇది మాత్రమే కాదు, ఒక విదేశీయుడికి మరొక దేశంతో ప్రత్యేక సంబంధం ఉంటే, అతను భారతదేశంలోకి ప్రవేశించకుండా నిషేధించవచ్చు. కొత్త చట్టం ప్రకారం, ఇమ్మిగ్రేషన్ అధికారిదే తుది నిర్ణయం. ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. దీనికి ముందు కూడా, విదేశీ పౌరులు ప్రవేశించకుండా నిరోధించారు. కానీ ఇది ఏ చట్టం, ఏ నియమంలో స్పష్టంగా ప్రస్తావించలేదు. ఇప్పుడు ఈ నిబంధన చట్టంగా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వలస ప్రక్రియను మరింత కఠినతరం చేస్తుందని భావిస్తున్నారు.

ఒక విదేశీయుడు నకిలీ పత్రాలను ఉపయోగించి భారతదేశంలోకి ప్రవేశిస్తే, అతన్ని దేశం నుండి బహిష్కరించడమే కాకుండా, రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అంతేకాదు అదనంగా, రూ. లక్ష నుండి రూ. 10 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు.

ప్రస్తుతం, వలసలు అడ్డుకునేందుకు విదేశీయులకు సంబంధించి నాలుగు ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నాయి. వీటిని కొత్త సమగ్ర చట్టంలో చేర్చాలని యోచిస్తున్నారు. ఈ కొత్త నియమాలు ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025’ కింద వస్తాయి. దీని కింద, పాత చట్టాలను విలీనం చేయడం జరుగుతుంది. విదేశీయుల చట్టం, 1946, పాస్‌పోర్ట్ చట్టం, 1920, విదేశీయుల రిజిస్ట్రేషన్ చట్టం, 1939 మరియు ఇమ్మిగ్రేషన్ (కెరీర్ లయబిలిటీ) చట్టం, 2000. కొత్త చట్టం అమలు తర్వాత, ఈ నాలుగు పాత చట్టాలను సమగ్ర చట్టాన్ని రూపొందించడానికి సవరిస్తారు. తద్వారా విదేశీ పౌరుల పర్యవేక్షణ మరియు దేశ భద్రతను బలోపేతం చేయవచ్చు. ప్రస్తుతం భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తున్నారు. ఒక వ్యక్తి నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశానికి వస్తే, అతనికి గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష, రూ. 50,000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది.

కొత్త చట్టం ప్రకారం, ఉన్నత విద్య కోసం భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే ఏ విదేశీ విద్యార్థి అయినా వారి సమాచారాన్ని విదేశీయుల నమోదు అధికారులకు అందించాల్సి ఉంటుంది. అలాగే, విదేశీ పౌరులకు వసతి అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, వైద్య సంస్థలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే ఒక విదేశీయుడు నిర్దేశించిన వీసా వ్యవధికి మించి భారతదేశంలో ఉండిపోతే, వీసా నియమాలను ఉల్లంఘిస్తే లేదా ఏదైనా నిషేధిత ప్రాంతాన్ని సందర్శిస్తే, వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 3 లక్షల వరకు జరిమానా కొన్ని సందర్భాల్లో రెండూ అనుభవించాల్సి ఉంటుంది.

ఒక విదేశీ పౌరుడికి చెల్లుబాటు అయ్యే వీసా లేదా పాస్‌పోర్ట్ లేకపోతే, అతన్ని భారతదేశానికి తీసుకువచ్చే వ్యక్తి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు రూ.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

ప్రతిపాదిత బిల్లు ప్రకారం, ఏ విదేశీ పౌరుడైనా భారతదేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించడానికి, భారతదేశం విడిచి వెళ్లమని ఆదేశించడానికి, ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి, అతని బయోమెట్రిక్ డేటాను నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఈ కొత్త చట్టంతో, భారతదేశ సరిహద్దుల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చు. అక్రమంగా ప్రవేశించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో భద్రతా వ్యవస్థ మరింత ప్రభావవంతంగా మారుతుంది. వీసా నిబంధనలను ఉల్లంఘించే వారిని అరికట్టవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…