AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ నటీమణి సినీ కెరీర్ సూపర్ హిట్.. కానీ వ్యక్తిగత జీవితంలో..

బహుముఖ ప్రజ్ఞాశాలి రాజసులోచన, నాట్య, సినీ రంగాలతో పాటు కార్ డ్రైవింగ్, బోట్ రైడింగ్‌లలోనూ గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టి, మద్రాసులో పెరిగిన ఆమె, వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రెండు వివాహాలు, వృత్తిపరమైన ఆటుపోట్లను అధిగమిస్తూ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.

Tollywood: ఈ నటీమణి సినీ కెరీర్ సూపర్ హిట్.. కానీ వ్యక్తిగత జీవితంలో..
Rajasulochana
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2026 | 10:06 PM

Share

భారతీయ సినీ చరిత్రలో ఒక ధృవతారగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందారు సీనియర్ నటి రాజసులోచన. 1934 ఆగస్టు 15న విజయవాడలో భక్తవత్సలం నాయుడు, దేవిక దంపతులకు ఆమె జన్మించారు. పిల్లల కోసం పరితపిస్తున్న ఆ దంపతులకు కలిగిన ఏకైక సంతానమే రాజసులోచన. ఆమె అసలు పేరు రాజీవలోచన కాగా, స్కూలు రిజిస్టర్‌లో పొరపాటున రాజసులోచన అని నమోదు కావడంతో అదే పేరు స్థిరపడింది. రాజసులోచన బాల్యం మద్రాసులో గడిచింది. ఆమె తండ్రి భక్తవత్సలం నాయుడు ఎన్.ఎం. రైల్వేలో జనరల్ మేనేజర్ పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. నాట్యం అంటే రాజసులోచనకు చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేది. కళాభిమాని అయిన ఆమె మేనమామ స్థాపించిన సుగుణ విలాస సభ నాటక, నృత్య ప్రదర్శనలు ఆమెకు ప్రేరణనిచ్చాయి. ఏడేళ్ల వయసులో పంకజం టీచర్ వద్ద సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టినా, ఆమె దృష్టి ఎక్కువగా నృత్యంపైనే ఉండేది.

మూడవ ఫారంలోనే చదువు మానేసి, తన 13వ ఏట స్టేజిపై తొలిసారి అరంగేట్రం చేశారు రాజసులోచన. కొంతమంది ఆడపిల్లలకు నృత్యం నేర్పే క్రమంలో ఆమెకు పరమశివం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. తల్లిదండ్రుల అంగీకారం లేకపోయినా 1951 సెప్టెంబర్ 11న కరుణానిధి సమక్షంలో పరమశివంతో వివాహం జరిగింది. పెళ్లికి ముందే గుణసాగరి చిత్రంలో ఓ నృత్య సన్నివేశంలో పాల్గొన్నప్పటికీ, ఆ చిత్రం ఆలస్యంగా విడుదలైంది. 1952లో కె.ఎస్. ప్రకాశరావు తన కన్నతల్లి చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. కూచిపూడి యక్షగానంలో నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తితో కలిసి నటించారు. పెళ్లయిన ఏడాదికి శ్యామ్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. కన్నతల్లి చిత్రం తర్వాత పెంపుడు కొడుకు, అంతా మనవాళ్లే, కాళహస్తి మహత్యం వంటి చిత్రాలలో నటించారు. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాల్లో వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ, ఎన్.టి.ఆర్. నటించిన సొంత ఊరు చిత్రంతో హీరోయిన్‌గా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత మాంగల్యబలం, రాజమకుటం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర తారగా ఎదిగారు.

నటిగా బిజీ అయిన రాజసులోచన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. భర్త పరమశివం వేధింపులు భరించలేక ఆయనకు విడాకులు ఇచ్చి, కుమారుడు శ్యామ్‌తో ఒంటరిగా జీవనం సాగించారు. ఈ కష్టకాలంలో దర్శకుడు సి.ఎస్.రావులోని మంచితనాన్ని గమనించి, ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. సి.ఎస్.రావు అప్పటికే వివాహితుడై, ఇద్దరు పిల్లలున్నప్పటికీ, రాజసులోచనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1963 మేలో గురువాయూర్‌లో వీరి వివాహం జరిగింది. 1966 జులై 27న ఈ దంపతులకు కవల పిల్లలు (శ్రీ గురుమూర్తి దేవి, దేవి కృష్ణ) జన్మించారు, ఇది ఆ రోజుల్లో అరుదైన వార్తగా నిలిచింది. రాజసులోచన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి, ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్., ఎం.జి.ఆర్., శివాజీ గణేశన్, ప్రేమ్ నజీర్, రాజ్‌కుమార్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు. మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు చిత్రానికి నృత్య దర్శకత్వం వహించారు. అయితే, సి.ఎస్.రావుతో ఆమె వైవాహిక జీవితం పిల్లలు ఎదిగిన తర్వాత అభిప్రాయ భేదాలతో ముగియడం దురదృష్టకరం. తన జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న రాజసులోచన 2013 మార్చి 5న తుది శ్వాస విడిచారు.

Follow Us