New born: అప్పుడే పుట్టిన ఆడబిడ్డ గొంతు కోసి.. చెత్తకుప్పలో విసిరేశారు! కానీ విధి ప్రాణం పోసింది
ఆడ పిల్లల పట్ల వివక్ష ఎప్పటికి అంతమవుతుందో.. దీనికి అంతెక్కడ ఉందో తెలియకుంది. తాజాగా అప్పుడే పుట్టిన ఆడశిశువు గొంతు కోసి చంపింది ఆ బిడ్డ సొంత అమ్మమ్మ. అనంతరం చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకుంది. కన్నోళ్లు, అయినోళ్లు ఇంత దారుణానికి పాల్పడినా.. విధి మాత్రం విచిత్రంగా ఆ పసికందుకు అండగా నిలిచింది. మానవత్వం ఉన్న మనుషుల కారణంగా ఆ చిన్నారి తిరిగి ప్రాణం పోసుకుని మృత్యుంజయురాలిగా నిలిచింది.ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

భోపాల్, ఫిబ్రవరి 16: మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ పట్టణంలో ఓ మహిళ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బిడ్డ అమ్మమ్మ ఆ శిశువు గొంతు కోసి చంపేందుకు యత్నించింది. బిడ్డ మెడ చుట్టూ రక్తం కారడంతో అచేతనంగా మారడంతో చనిపోయి ఉంటుందని భావించి, చెత్త కుప్పలో పడేసింది. రక్తమోడుతున్న ఆ పసికందును ఆ దారిన పోయేవారు చూసి చలించి పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు ఆ పసికందును మొదట జిల్లా ప్రభుత్వ దవాఖనకు, ఆ తర్వాత భోపాల్‌లోని కమలా నెహ్రూ దవాఖానకు తరలించారు.
ఆ ఆస్పత్రి డాక్టర్లు రెండు సర్జరీలు చేసి బిడ్డకు ప్రాణం పోశారు. కమలా నెహ్రూ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్స్ విభాగం అధిపతి డాక్టర్ ధీరేంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఆ పసికందును గత నెలలో గొంతువద్ద గాయాలతో మా ఆస్పత్రిలో చేర్పించారు. గొంతుకు గాయమైనప్పటికీ, ముఖ్యమైన నరాలకు దెబ్బ తగలలేదు. అందువల్లనే సర్జరీ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. నెల రోజులకుపైగా శ్రమించి ఆ చిన్నారికి వైద్యం చేశాం. ప్రస్తుతం ఆ శిశువు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అజేయురాలైన ఆ బిడ్డకు పీహూ అని పేరు పెట్టినట్లు తెలిపారు. పీహూ కోసం ఎవరూ రాకపోవడంతో బాలల సంక్షేమ కమిటీ అనుమతితో రాజ్‌గఢ్‌లోని ఓ షెల్టర్ హోమ్‌కు అప్పగించినట్లు తెలిపారు. జనవరి 11వ తేదీ రాత్రి ఈ దారుణం చోటు చేసుకోగా దాదాపు నెల తర్వాత బిడ్డ పూర్తిగా కోలుకుంది. ఈ దారుణానికి పాల్పడిన బిడ్డ తల్లి, అమ్మమ్మలను అరెస్ట్ చేసినట్లు రాజ్‌గఢ్ జిల్లాలోని పచోర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అఖిలేష్ వర్మ తెలిపారు.
పోలీసు దర్యాప్తు ప్రకారం బిడ్డ తల్లికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఈ క్రమంలో గర్భం దాల్చడంతో పుట్టిన బిడ్డను వదిలించుకోవడానికి, ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. కాగా గత నాలుగేళ్లుగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు వరుసగా నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 క్రైమ్ ఇన్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆ సంవత్సరం రాష్ట్రంలో 175 నవజాత శిశువులను పుట్టీపుట్టగానే రోడ్లపై విసిరేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








