Youtube: టెకీ నయా దందా.. యూట్యూబ్ చూసి గుట్టుగా బైక్ చోరీలు!
బీటెక్ చదివిన ఓ యువకుడు ఇంజనీర్‌లో ఉద్యోగం తెచ్చుకుని మంచి పేరు తెచ్చుకుంటాడని అనుకుంటే తల్లిదండ్రులకు ఊహించని షాకిచ్చాడు. యూట్యూబ్ చూసి దొంగతనాలు నేర్చుకుని గుట్టుగా బైక్‌లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఇలా యేళ్లుగా ఎన్నో బైక్‌లు చోరీ చేసి జల్సాలు చేయసాగాడు. కానీ చివరకు..

గుంటూరు, ఫిబ్రవరి 18: ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తాడనుకుంటే.. టెక్నాలజీని వాడి దొంగతనాలు చేయడం ప్రారంభించాడో టెకీ. వ్యవసనాలకు బానిపై చిల్లర పనులు చేస్తుండటంతో తల్లిదండ్రులు ఇంటి నుంచి తరిమేశారు. దీంతో అడ్డూఅదుపూ లేకుండా యూట్యూబ్‌లో చూసి బైక్‌లు కొట్టేయడం ప్రారంభించాడు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా రద్దీ ప్రాంతాల్లో ఏళ్లుగా బైకులు మాయం చేయసాగాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో ఇతగాడి నేరచరిత్ర బయటపడింది. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ సతీష్‌కుమార్ వివరాల ప్రకారం..
గుంటూరు జిల్లా నల్లపాడు రత్నగిరికాలనీకి చెందిన వెలివోలు వెంకటేశ్వర్లు బీటెక్ చదువుకున్నాడు. 2017లో నగరంపాలెంలోని హౌసింగ్ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా కొంత కాలం పనిచేశాడు కూడా. అయితే అక్కడ పనిచేస్తున్నప్పుడు అవకతవకలపై చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు అతడిని దూరం పెట్టసాగారు. అయితే వెంకటేశ్వర్లు మాత్రం విచ్చలవిడిగా వ్యసనాలకు అలవాటు పడ్డాడు. మద్యానికి బానిసై డబ్బు కోసం చోరీలు చేయడం ప్రారంభించాడు.
యూట్యూబ్ చూసి బైక్‌లు ఎలా దొంగతనం చేయాలని తెలుసుకున్నాడు. ఆ తర్వాత రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి, పార్కింగ్ చేసిన వాటిని మారుతాళాలతో మాయం చేసేవాడు. అలా చోరీ చేసిన బైక్‌లను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి తెలివిగా మిత్రుడు పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడుకు చెందిన మోరంరెడ్డి సీతారామిరెడ్డికి విక్రయించేవాడు. అతడు వాటిని ఇతరులకు అమ్మి, వెంకవేశ్వర్లుకు కొంత కమీషన్‌గా ఇచ్చేవాడు. ఇలా వీరి దందా యేళ్లుగా సాగింది. తాజాగా వీరి బండారం బయట పడటంతో అసలు గుట్టు వీడింది. సోమవారం గుజ్జనగుండ్ల వద్ద వెంకటేశ్వర్లును అరెస్టు చేసి 12 ద్విచక్రవాహనాలు జప్తు చేశారు. కాగా సీతారామిరెడ్డిపై గతంలో 40 చోరీ కేసులున్నాయని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.