Andhra Pradesh: పిల్లలను కంటే రూ.25వేలు.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఎప్పటినుంచంటే..?
ముందు జనాభా విషయంలో పోటీ పడదాం, మిగతా రాష్ట్రాల్ని దాటి దూసుకెళదాం, ఆ తర్వాత అభివృద్ధి దానంతటదే జరుగుతుందని ఏపీ సర్కార్ అంటుంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఒకప్పుడు అవసరం, ఇప్పుడు అసంబద్ధం. అయినా పోషణకు సరిపడా పైసలున్నవాళ్లు ఎందుకు తక్కువ మంది పిల్లల్ని కంటున్నారు అని సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు.. ఇదీ కొత్త నినాదం. రాష్ట్రంలో ఏడాదికి 6.7 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు, ఇది సరిపోదు… 1992లో 3శాతం ఉన్న సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 1.5 శాతానికి పడిపోయింది. ఇది 2.1కి పెరిగితేనే ప్రగతికి ఛాన్స్. లేదంటే ఇక్కట్లే అని తేల్చేశారు. దేశంలో కంటే రాష్ట్రంలో వృద్ధాప్యం రేటు ఎక్కువగా ఉందని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి ఇంకా పెరుగుతుందని హెచ్చరించారు. 57 శాతం మంది దంపతులు ఒక్కరితోనే ఆపేస్తున్నారు. 32 శాతం మంది ఇద్దరిని కంటున్నారు. 9శాతం మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువమందిని కంటున్నారని.. ఈ లెక్క మారాల్సిందేనని చెప్పారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ అమల్లోకి రానుంది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో పాతికవేలు నజరానా ఇస్తామని, రెండో బిడ్డను కన్న తండ్రికి ఒక నెల, మూడో బిడ్డను కన్న తండ్రికి 2 నెలలు సెలవు మంజూరు చేస్తామని తాయిలాల మీద తాయిలాలను ప్రభుత్వం ప్రకటించింది.
కనడం వరకే మీ వంతు.. పెంపకం మా బాధ్యత.. పిల్లలను మెరుగైన జీవన ప్రమాణాలతో ఎలా పెంచాలో మేం చూసుకుంటాం అని భరోసానిస్తోంది. బలవంత ప్రసవాల్ని ప్రోత్సహిస్తామని హింట్ కూడా ఇస్తోంది. కాగా గతంలో ఇద్దరు దాటొద్దని హద్దు గీసిన ప్రభుత్వాలే ఇప్పుడు ముగ్గురైతేనే ముద్దు అని కొత్త పద్దు రాస్తున్నాయి. ఎన్నికల్లో పోటీకి అనర్హత లాంటి నిబంధనలు పెట్టిన ప్రభుత్వాలే ఇప్పుడు తల్లికి వందనం లాంటి పథకాలతో సంతానోత్పత్తిని పరోక్షంగా పెంచిపోషిస్తున్నాయి. ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు అనే కొత్త పాలసీపై ప్రస్తుతానికైతే జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ప్రభుత్వం మాత్రం పట్టుదలగా ఉంది. గతంలో చంద్రబాబు మాటల్ని వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు సమర్థిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇటీవలే పాపులేషన్‌ని కంట్రోల్ అవసరమే లేదన్నారు. ప్రస్తుతానికి యూపీ, బిహార్‌లో మాత్రమే అత్యధిక జనాభా ఉంది. నార్తిండియాతో పోలిస్తే దక్షిణ భారత దేశంలో జనాభా తక్కువ. పైగా, డీలిమిటేషన్‌లో జనాభా కీలకంగా మారింది. నియోజకవర్గాల సంఖ్యను పెంచుకుని రాజకీయంగా లాభపడాలని చూస్తున్నట్టు రాజకీయ పార్టీలపై అభియోగం ఉంది. ఏపీ సర్కార్ మాత్రం రాజకీయం కాదు తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటోంది. దక్షిణాదిలో తమిళనాడు లాంటి మరికొన్ని రాష్ట్రాలు కూడా పాపులేషన్ మేనేజ్‌మెంట్‌కే జైకొడుతున్నాయి. జనంలో అవగాహన పెంచడానికి ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
