AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రీఫండ్‌‌ అమౌంట్లో రూ.5 తగ్గించిన రైల్వేస్.. ఊహించని షాకిచ్చిన కోర్టు! ప్రయాణికుడికి భారీ నష్టపరిహారం

పంజాబ్‌లోని లుధియానా వినియోగదారుల కమిషన్ భారతీయ రైల్వేలకు రూ.10,000 జరిమానా విధించింది. రద్దు చేసిన టిక్కెట్‌పై రావాల్సిన రీఫండ్‌లో రూ.5 తక్కువగా చెల్లించినందుకు ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనిని 'సేవా లోపం', 'అన్యాయ వాణిజ్య పద్ధతి'గా కమిషన్ తేల్చి, రూ.5 రీఫండ్‌తో పాటు పరిహారంగా రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది, వినియోగదారుల హక్కులకు ప్రాధాన్యతనిచ్చింది.

Indian Railways: రీఫండ్‌‌ అమౌంట్లో రూ.5 తగ్గించిన రైల్వేస్.. ఊహించని షాకిచ్చిన కోర్టు! ప్రయాణికుడికి భారీ నష్టపరిహారం
Indian Railways Fined
SN Pasha
|

Updated on: Jun 17, 2026 | 4:21 PM

Share

పంజాబ్‌లోని లుధియానా జిల్లా వినియోగదారుల కమిషన్ భారతీయ రైల్వేలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. క్యాన్సెల్ టిక్కెట్‌పై రావాల్సిన రీఫండ్‌లో రూ.5 తక్కువగా చెల్లించిన వ్యవహారంలో, ఆ రూ.5ను తిరిగి ఇవ్వడంతో పాటు రూ.10,000 ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. లుధియానాకు చెందిన ప్రేమ్‌జిత్ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ తీర్పు వెలువడింది. ప్రేమ్‌జిత్ సింగ్ 2023 ఫిబ్రవరి 28న తన కోసం, తన తండ్రి కోసం హిసార్ నుంచి లుధియానాకు రెండు రైలు టిక్కెట్లు రూ.330 చెల్లించి కొనుగోలు చేశాడు. వ్యక్తిగత కారణాలతో ప్రయాణానికి ఒక రోజు ముందు టిక్కెట్లను రద్దు చేసుకున్నాడు. రద్దు ఛార్జీల కింద రూ.240 మినహాయించిన తర్వాత అతనికి రూ.90 రీఫండ్ రావాల్సి ఉండగా, అతని ఖాతాలో కేవలం రూ.85 మాత్రమే జమైంది.

ఈ విషయంలో రైల్వే హెల్ప్‌లైన్, టిక్కెట్ కౌంటర్ సిబ్బంది, స్టేషన్ అధికారులను సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాధానం లభించలేదు. దీంతో ప్రేమ్‌జిత్ సింగ్ లీగల్ నోటీసు పంపి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. విచారణలో రైల్వేలు తమకు సంబంధం లేదని, ఆ రూ.5ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీఫండ్ ఫీజుగా మినహాయించిందని వాదించాయి. అయితే కమిషన్ పరిశీలనలో 2017 రైల్వే బోర్డు నోటిఫికేషన్ ప్రకారం POS యంత్రాల ద్వారా రూ.1,000లోపు రీఫండ్‌లపై రూ.5 ఫీజు వసూలు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని కౌంటర్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాల్సిన బాధ్యత రైల్వేలదేనని తేలింది.

ప్రెసిడెంట్ సంజీవ్ బాత్రా, సభ్యురాలు మోనికా భగత్‌లతో కూడిన ధర్మాసనం, ప్రయాణికుడికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం సేవల లోపం, అన్యాయ వాణిజ్య పద్ధతిగా పేర్కొంది. దీంతో రూ.5 రీఫండ్‌తో పాటు రూ.10,000 ఖర్చులను 30 రోజుల్లో చెల్లించాలని రైల్వేలను ఆదేశించింది. నిర్ణీత గడువులో చెల్లించకపోతే రోజుకు రూ.200 చొప్పున అదనపు జరిమానా విధించాలని కూడా స్పష్టం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us