AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పెళ్లి పత్రిక మొక్కగా మారుతుంది.. ఐడియా అదుర్స్ కదూ!

పెళ్లి ఆహ్వాన పత్రికను చదివి పారేయకుండా, కుండీలో నాటితే తులసి మొక్కగా మారితే ఎలా ఉంటుంది? రాజన్న సిరిసిల్లకు చెందిన జ్ఞానేందర్ గుప్తా తన కుమార్తె వివాహానికి విత్తనాలతో కూడిన ఎకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్ కార్డులు ముద్రించి పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశాన్ని అందించారు. ఈ ఆలోచన ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ పెళ్లి పత్రిక మొక్కగా మారుతుంది.. ఐడియా అదుర్స్ కదూ!
Eco Friendly Wedding Invita
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 06, 2026 | 5:39 PM

Share

సాధారణంగా పెళ్లి ఆహ్వాన పత్రికలు వేడుక ముగిసిన తర్వాత వ్యర్థాలుగా మారిపోతుంటాయి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్ గుప్తా మాత్రం తన కుమార్తె వివాహాన్ని పర్యావరణ పరిరక్షణకు అనుసంధానం చేస్తూ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన తయారు చేయించిన పెళ్లి పత్రికలు అతిథులను ఆహ్వానించడమే కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సందేశాన్ని కూడా అందిస్తున్నాయి.

వ్యాపారరీత్యా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న జ్ఞానేందర్ గుప్తా, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. నిరుపేదల కోసం సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్ నగరాల్లో ఉచిత స్వర్గలోక యాత్ర వాహనాలు, బాడీ ఫ్రీజర్లను అందిస్తూ సేవలందిస్తున్న ఆయన, తన కుటుంబ వేడుకను కూడా సమాజానికి ఉపయోగపడేలా నిర్వహించాలని సంకల్పించారు. అందులో భాగంగా పెళ్లి ఆహ్వాన పత్రికలో ప్రత్యేకంగా తులసి విత్తనాలను పొందుపరిచారు. ఆహ్వాన పత్రికను చదివిన తర్వాత పారేయకుండా మట్టితో నింపిన కుండీలో ఉంచి, దానిపై కొద్దిగా మట్టి వేసి ప్రతిరోజూ నీరు పోస్తే వారం రోజుల వ్యవధిలో కార్డు పూర్తిగా కరిగిపోయి, అందులోని తులసి విత్తనం మొలకెత్తి చిన్న మొక్కగా ఎదుగుతుందని కార్డుపైనే వివరించారు.

ఒక ఆహ్వాన పత్రికను చెత్తగా కాకుండా, ఒక మొక్కగా మార్చే ఈ వినూత్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి జ్ఞాపకంగా ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క పెరిగితే పర్యావరణ పరిరక్షణకు చిన్నదైనా గొప్ప సహకారం అందించినట్లేనని జ్ఞానేందర్ గుప్తా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వినూత్న పెళ్లి పత్రికలు స్థానికంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదేనని, చిన్న చిన్న ఆలోచనలతోనే పెద్ద మార్పు సాధ్యమవుతుందని ఈ ప్రయత్నం మరోసారి చాటిచెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us