భారత్‌లో తొలిసారి కనిపించిన అరుదైన పాము.. 35 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు!
భారతదేశంలోనే మొదటిసారిగా అత్యంత అరుదైన సిస్తాన్ సాండ్ బోవా (Sistan Sand Boa) అనే పాము జాతిని శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు. ఇప్పటివరకు కేవలం ఇరాన్, పాకిస్తాన్ దేశాలకే పరిమితమైన ఈ విదేశీ సరీసృపాన్ని వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ డాక్టర్ జీతూ సోలంకి, పరిశోధకులు వివేక్ శర్మ, ధర్మేంద్ర ఖండాల్ కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ వివరాలు అంతర్జాతీయ సైన్స్ జర్నల్ జర్నల్ ఆఫ్ త్రెటెండ్ టాక్సాలో ప్రచురితమయ్యాయి. దేశంలో దాదాపు 35 ఏళ్ల తర్వాత ఒక కొత్త సాండ్ బోవా జాతి నమోదు కావడం ఇదే తొలిసారి.

భారతీయ వన్యప్రాణి, పర్యావరణ రంగంలో ఒక సరికొత్త మైలురాయి నమోదైంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో గల జోర్‌బీడ్ కన్జర్వేషన్ రిజర్వ్‌తో పాటు థార్ ఎడారి పరిసర ప్రాంతాలలో అత్యంత అరుదైన సిస్తాన్ సాండ్ బోవా (Eryx sistanensis) అనే పాము జాతిని శాస్త్రవేత్తలు అధికారికంగా రికార్డు చేశారు. ఇప్పటివరకు ఈ ప్రత్యేక జాతి పాములు కేవలం ఇరాన్, పాకిస్తాన్ దేశాల్లోని కొన్ని పొడి ప్రాంతాలకే పరిమితమని భావించేవారు.
35 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు:
భారతదేశంలో ఒక కొత్త సాండ్ బోవా (ఇసుక పాము) జాతి అధికారికంగా నమోదు కావడం గత 35 సంవత్సరాలలో ఇదే తొలిసారి. గతంలో విటేకర్స్ బోవాను గుర్తించిన తర్వాత, మళ్లీ ఇన్నాళ్లకు ఈ సరికొత్త ఆవిష్కరణ జరిగింది. ప్రసిద్ధ అంతర్జాతీయ వైజ్ఞానిక పత్రిక సైన్స్ జర్నల్ ఆఫ్ త్రెటెండ్ టాక్సాలో (Journal of Threatened Taxa) లో ప్రచురితమైన పరిశోధనా పత్రం ప్రకారం, ఈ పాము ఆనవాళ్లు రాజస్థాన్‌లోని బికనీర్, చురు, సికార్ జిల్లాల పరిధిలో లభించాయి. వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ జీతూ సోలంకి జోర్‌బీడ్‌లో దీనిని మొదట గుర్తించగా, పరిశోధకులు వివేక్ శర్మ, ధర్మేంద్ర ఖండాల్ దీనిపై సమగ్ర అధ్యయనం చేసి ఇది సిస్తాన్ సాండ్ బోవా అని ధృవీకరించారు.
ఇరాన్ సరిహద్దుల నుండి థార్ ఎడారికి:
ఇరాన్ దేశంలోని సిస్తాన్ ప్రాంతానికి, ప్రస్తుతం ఈ పాము లభించిన రాజస్థాన్‌లోని థార్ ఎడారికి మధ్య దాదాపు 2,200 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత సుదీర్ఘ దూరంలో ఉన్న ఈ భౌగోళిక ప్రాంతంలో ఈ జాతి మనుగడ సాగించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పరిశోధనల సమయంలో సికార్ జిల్లాలో ఒక పిల్ల పాము, ఒక చిన్నది, ఒక పూర్తి ఎదిగిన పాముతో కలిపి మొత్తం మూడు సజీవ పాములను వారు గుర్తించారు. ఇవి చూడటానికి సాధారణంగా భారత్‌లో కనిపించే జాన్ బోవా (Eryx johnii – రెండంచుల పాము) లాగే ఉన్నప్పటికీ, వీటి శరీర నిర్మాణం, పొలుసులు, జన్యుపరమైన అంశాలలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి.
View this post on Instagram
పర్యావరణ ప్రాధాన్యత:
బికనీర్‌లోని జోర్‌బీడ్ ప్రాంతం ఇప్పటివరకు అంతరించిపోతున్న రాబందుల (Vultures) సంరక్షణకు, వలస పక్షులకు మాత్రమే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. కానీ, ఈ తాజా ఆవిష్కరణతో ఈ ఎడారి పర్యావరణ వ్యవస్థ అరుదైన సరీసృపాల (Reptiles) జీవవైవిధ్యానికి కూడా అత్యంత అనుకూలమైనదని స్పష్టమైంది. ఈ పరిశోధన ఆధారంగా భారత్‌లోని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో కూడా ఈ జాతి పాములు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.




