Viral Video: ఓర్నీ.. ఇదేదో మ్యాజిక్‌లా ఉందే.. ఈకల్లేని కోడిపుంజును ఎక్కడైనా చూశారా..?
కోడి పుంజు, పెట్ట , ఫారం కోడి, బాయిలర్ కోడి.. వీటిని వివిధ రంగుల్లో ఈకలతో చూస్తుంటాము. కాని అసలు కోడికి ఈకలు లేకపోతే ఎలా ఉంటుంది. చూసేందుకు కాస్త చిత్రంగానే ఉంటుంది కదూ. అలాంటి అరుదైన కోడి సహజమైన కోడిలా జీవించగలుగంతుందా..? ఏ లోపం వల్ల దానికి ఇలాంటి సమస్యలు వస్తాయి.. అనే ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కోళ్ల పేరు వింటేనే జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా ఇటీవల కాలంలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే ఆ విషయం పక్కన పెడితే కోడి పెట్టగాని.. కోడిపుంజు గానీ ఒంటినిండా ఈకలతో ఉంటాయి.. అలాగే రెక్కలకు పొడవైన ఈకలు కలిగి ఉంటాయి. మరీ ముఖ్యంగా కోడిపుంజులు అయితే ఈకల రంగులను బట్టి జాతులలో వాటి పేరును నిర్ణయిస్తారు. కోడిపుంజులలో ఈకలకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ కోడిపుంజు పిల్లకి అసలు ఈకలే లేవు. దాంతో అక్కడి స్థానికులు దానిని వింతగా చూస్తున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడానికి చెందిన షేక్ ఇస్మాయిల్ తన ఇంటి వద్ద పెరటిలో నాటు కోళ్లను పెంచుతారు. అయితే తన వద్ద ఉన్న కోడిపెట్ట ఆరు నెలల క్రితం గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను కోడి పిల్లల కోసం ఇస్మాయిల్ పొదగేశారు. ఆ గుడ్లు పొదిగి కోడి పిల్లలు తయారయ్యాయి. అయితే, అందులో ఓ కోడి పిల్లకు ఒక్క ఈక కూడా లేదు. దాంతో వయసు పెరిగేకొద్ది ఆ కోడి పిల్లకు ఈకలు వస్తాయని ఇస్మాయిల్ భావించాడు.
కానీ సుమారు నాలుగు నెలలు వయసు గడిచినా సరే శరీరం మీద ఎక్కడ దానికి ఈకలు రాలేదు. అందులోనూ అది కోడిపుంజు కావడంతో అసలు ఈకలు ఎందుకు రావడం లేదు అనే విషయం ఇస్మాయిల్ కు అర్థం కాలేదు. మిగతా కోళ్లలాగే ఆహారంతోపాటు అన్ని క్రియలను ఈకలు లేని కోడిపుంజు చేస్తుంది. కోడిపుంజు అయినా దానికి ఈకలు లేకపోవడం కారణంగా కోడిపందాలకు పని చేయదు. అయితే ఇస్మాయిల్ వద్ద ఉన్న ఈ వెరైటీ కోడిపుంజును చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
వీడియో చూడండి..
ఇలా ఈకలు లేకుండా ఉన్న కోడిపుంజును ఈ ప్రాంతంలో తామ ఎక్కడా చూడలేదని ఆశ్చర్యo వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధారణంగా కోళ్లలో ఈకలు లేమి సమస్య తలెత్తిదంటున్నారు వైద్యులు. జన్యు సంబంధమైన లోపాల కారణంగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఈకలు లేకపోవడం సంభవిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈకలు రాకపోవడం కారణంగా కోడికి ఎటువంటి అనారోగ్యం దీనికి ఉండదు.. అయితే ఈకలు లేకపోవడం వల్ల సాధారణ కోళ్లు మాదిరి ఎగరడానికి వీలుండదని పశు వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
