Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Exams Twice a Year: ఇక ఏడాదికి 2 సార్లు 10, 12 తరగతుల పరీక్షలు.. ముహూర్తం ఫిక్స్‌!

10, 12 తరగతుల విద్యార్ధులకు సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు సమాయాత్తం అవుతుంది. అన్నీ కుదిరితే 2026 నుంచే ఈ విధానం కార్యరూపం దాల్చనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు..

CBSE Exams Twice a Year: ఇక ఏడాదికి 2 సార్లు 10, 12 తరగతుల పరీక్షలు.. ముహూర్తం ఫిక్స్‌!
CBSE Exams Twice A Year
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 20, 2025 | 12:16 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: విద్యార్ధులకు సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించనుంది. అన్నీ కుదిరితే 2026 నుంచే ఈ విధానం కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అధ్యక్షతన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి, సీబీఎస్‌ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌), నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్‌) ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఏర్పాటుచేయగా.. వచ్చే సోమవారం నుంచి దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమలులోకి వస్తే విద్యార్ధులకు పరీక్షల స్ట్రెస్‌ ఇక ఉండదనే చెప్పాలి. అంతేకాదు వారి స్కోర్ మరింత పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 2026-27 విద్యా సంవత్సరం నుంచి గ్లోబల్‌ కరిక్యులమ్‌ కూడా అందుబాటులోకి తీసుకురావలని సీబీఎస్సీ బోర్డు యోచిస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని సీబీఎస్సీ అనుబంధ స్కూళ్లలో ఒకే విధమైన సిలబస్‌ ఉంటుందన్నమాట.

ఏడాదికి రెండుసార్లు నిర్వహించే బోర్డు పరీక్షల్లో.. విద్యార్థులు ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధిస్తే, వాటినే పరిగణనలోకి తీసుకొంటారు. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించినా.. విద్యార్థులు రెండుసార్లూ పరీక్షలకు హాజరవ్వడం తప్పనిసరికాదు. జేఈఈ మాదిరిగా 10, 12 తరగతుల విద్యార్థులు కూడా బోర్డు పరీక్షలకు రెండుసార్లు హాజరవ్వొచ్చు. ఇది పూర్తిగా విద్యార్ధుల ఛాయిస్. అలాగే ఇలా ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. సీబీఎస్‌ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలను ప్రస్తుతం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించి మేలో ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఫెయిలైన విద్యార్థులకు జూలైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ పరీక్షల్లోనే ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో తమ మార్కులను మెరుగుపర్చుకోవడానికి పాసైన విద్యార్థులకూ అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విధానం అమలులో ఉంది. అయితే తాజా విధానం అమల్లోకి వస్తే రెండు బోర్డు పరీక్షల మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) ప్రవేశాలపై దీని ప్రభావం ఏ మాత్రం పడకుండా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవడానికి తగిన సమయం లభిస్తుంది. ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం 2026 నుంచి అమలు చేసేందుకు కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.