AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సుందర ట్రావెల్స్’ బ్యూటీ రాధ గుర్తుందా? 18 ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌తో వెండితెరపైకి

ఒకప్పుడు పక్కింటి అమ్మాయి లాంటి రూపంతో కుర్రకారు మనసులు దోచుకున్న ఆ నటి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ కాలం ఆమెను వెండి తెరకు దూరం చేసింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి.

‘సుందర ట్రావెల్స్’ బ్యూటీ రాధ గుర్తుందా? 18 ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌తో వెండితెరపైకి
Senior Actress Re Entry
Nikhil
|

Updated on: Feb 28, 2026 | 6:00 AM

Share

సుమారు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన ఆ నటి ప్రయాణం ఎంతో ఆసక్తికరం. 2002లో విడుదలైన ఆ కామెడీ ఎంటర్టైనర్ నేటికీ టెలివిజన్ లో వస్తే జనాలు టీవీలకు అతుక్కుపోతారు. అందులోని బస్సు ప్రయాణం, కామెడీ సీన్లు ఎప్పటికీ మర్చిపోలేం. ఆ సినిమాలో మురళి సరసన ఎంతో అమాయకంగా, అందంగా కనిపించిన హీరోయిన్ అందరికీ గుర్తే ఉంటుంది.

ఆంధ్రా నుండి కోలీవుడ్ కు వెళ్లి మొదటి ప్రయత్నంలోనే మెగా హిట్ అందుకున్న ఆమె, ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ విధి మరోలా తలచింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు కనుమరుగైపోయి, ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి మళ్లీ తెరపైకి వచ్చిన ఆ నటి మరెవరో కాదు.. రాధ.

మొదటి సినిమాతోనే..

రాధ స్వస్థలం ఆంధ్రప్రదేశ్. మోడలింగ్, ప్రకటనల రంగంలో రాణిస్తున్న సమయంలో ఆమెకు తమిళంలో ‘సుందర ట్రావెల్స్’ (మలయాళ హిట్ ‘ఈ పరక్కుమ్ తళిక’ రీమేక్) లో నటించే అవకాశం వచ్చింది. మురళి, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రాధ నటనకు తమిళ తమ్ముళ్లు ఫిదా అయిపోయారు. పక్కింటి అమ్మాయిలాంటి ఆమె రూపం కోలీవుడ్ లో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత కార్తీక్ సరసన ‘గేమ్’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ, అవి ఆశించిన విజయాన్ని అందించలేదు.

Sundara Travels.. Radha

Sundara Travels.. Radha

వివాదాలు – కష్టాలు..

కెరీర్ ఆరంభంలోనే పెద్ద హిట్ పడినా, రాధకు పెద్ద బడ్జెట్ సినిమాలు లేదా స్టార్ హీరోల సరసన అవకాశాలు రాలేదు. దీంతో ఆమె ‘జంక్షన్’, ‘అడవడి’, ‘కాటవరాయన్’ వంటి చిన్న సినిమాలకే పరిమితం కావాల్సి వచ్చింది. క్రమంగా అవకాశాలు తగ్గిపోయి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. సినిమాల కంటే ఎక్కువగా ఆమె పేరు క్రైమ్, పొలిటికల్ వార్తల్లో వినిపించింది. ఒక వ్యాపారవేత్త పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని ఆమె చేసిన ఫిర్యాదు అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించింది.

ఇన్ని సమస్యల నుండి కోలుకున్న తర్వాత రాధ మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ముందుగా సీరియల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. విజయ్ టీవీలో ప్రసారమైన ‘భారతి కన్నమ్మ 2’ లో నెగిటివ్ రోల్ లో, కలైంజర్ టీవీలోని ‘పవిత్ర’ సీరియల్ లో నటించి మెప్పించింది. ఇప్పుడు మళ్లీ వెండితెరపై క్యారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించింది. తాజాగా విడుదలైన ‘స్వీటీ నట్టి క్రేజీ’లో ఆమె నటించింది. అలాగే విజయ్ ఆంటోనీ సరసన ‘వెట్టు’, ‘ఒరు పడమ్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.

రాధ లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి స్లిమ్ బ్యూటీ ఇప్పుడు కాస్త బరువు పెరిగి, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. “సుందర ట్రావెల్స్ లోని రాధేనా ఈమె?” అని అభిమానులు అడుగుతున్నారు. ఏది ఏమైనా, 18 ఏళ్ల విరామం తర్వాత ధైర్యంగా మళ్లీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన రాధ, తన సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా నిలదొక్కుకోవాలని కోరుకుందాం.

Follow Us