కాశీలో చనిపోతే నిజంగా మోక్షం లభిస్తుందా..? కాశీ మహిమ వెనుక ఉన్న రహస్యాలు
Kashi: కాశీ.. కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు.. హిందువుల ఆధ్యాత్మిక భావోద్వేగానికి ప్రతీక. హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి మరణించే సమయంలో పుత్రుల సంరక్షణలో ఉండాలి లేదా కాశీలో ఉండాలి అని అంటారు. మరి కాశీకి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది? దాని విశిష్టత ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ ధర్మంలో పవిత్ర పుణ్యక్షేత్రం కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. కాశీ.. కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు.. హిందువుల ఆధ్యాత్మిక భావోద్వేగానికి ప్రతీక. సాధారణంగా మనుషులు బతుకుదెరువు కోసం తమ సొంత ఊరును వదిలి వేరే చోటుకు వలస వెళ్తారు. కానీ, కాశీకి మాత్రం చాలా మంది మరణించడానికి వెళ్తారు. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలామంది కాశీ పట్టణానికి వచ్చి అక్కడే స్థిరపడతారు. భోళాశంకరుని సన్నిధిలో చివరి శ్వాస విడిచి మోక్షాన్ని పొందాలని ఆశిస్తూ జీవితాన్ని అక్కడే గడుపుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి మరణించే సమయంలో పుత్రుల సంరక్షణలో ఉండాలి లేదా కాశీలో ఉండాలి అని అంటారు. మరి కాశీకి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది? దాని విశిష్టత ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
యుగయుగాల చరిత్ర కలిగిన కాశీ
కాశీ పట్టణం ప్రపంచంలోని అతి పురాతన నగరాల్లో మొదటిదిగా భావించబడుతుంది. అక్కడి గాలి, మట్టి, విశ్వనాథుని లింగం, పవిత్రమైన గంగానది.. ఇవి అన్నీ యుగాల చరిత్రను తమలో దాచుకుని ఉన్నాయి. శాస్త్రవేత్తలకే పూర్తిగా అర్థం కాని అనేక రహస్యాలు కాశీలో ఉన్నాయి.
పురాణాల ప్రకారం శివుడు భూమిపై తొలిసారి అడుగుపెట్టిన ప్రదేశం కాశీ అని విశ్వాసం. అందుకే ఈ నగరం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
కాశీ దేవికి శివుడు ఇచ్చిన వరాలు
కాశీఖండం, భీమఖండం వంటి పురాణాల ప్రకారం కాశీ ఒక దేవిగా భావించబడుతుంది. శివుడు ఆమెకు ప్రత్యేకమైన జ్ఞానాన్ని ప్రసాదించాడని చెబుతారు. ఆ జ్ఞానంతో కాశీ దేవి పరమేశ్వరుని వద్ద మూడు వరాలు కోరింది.
- పరిపూర్ణ విశ్వాసంతో కాశీకి వచ్చి గంగానదిలో స్నానం చేసే వారి పాపాలన్నీ నశించాలి.
- కాశీలో ఎవరు ఎలా మరణించినా వారికి మోక్షం లభించాలి.
- మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్‌లలో దహన సంస్కారాలు జరిగితే ఆ ఆత్మలకు ముక్తి కలగాలి.
పరమేశ్వరుడు కాశీ దేవి కోరిన ఈ మూడు వరాలను అనుగ్రహించాడు. కానీ ఈ వరాలు చూసి పార్వతి దేవికి ఆశ్చర్యం కలిగింది.
పార్వతి సందేహం
పార్వతి దేవి శివుడిని ప్రశ్నిస్తూ.. “మహాదేవా! కాశీ దేవికి ఈ విధంగా వరాలు ఇవ్వడం వల్ల ముక్తి చాలా సులభమైపోయింది కదా?” అని అడిగింది.
అప్పుడు శివుడు చిరునవ్వుతో.. “దేవి! నిజం ఏమిటో నీకు చూపిస్తాను,” అని చెప్పి ఆమెను కాశీకి తీసుకెళ్లాడు.
శివుని లీలా
- ఆ సమయంలో కాశీ భక్తులతో కిటకిటలాడుతోంది. కొందరు గంగానదిలో స్నానం చేస్తుంటే.. మరికొందరు విశ్వనాథుని దర్శనం కోసం వెళ్తున్నారు.
- అప్పుడు శివుడు పార్వతితో.. “నేను ఇప్పుడు మరణించిన వ్యక్తిలా ఇక్కడ పడుకుంటాను. నువ్వు నేను చెప్పినట్లుగా చేయాలి,” అని చెప్పాడు.
- శివుడు గంగాతీరంలో మృతదేహంలా పడుకున్నాడు. పార్వతి అక్కడ ఉన్న భక్తులతో ఇలా చెప్పింది:
- ‘మీరిలో పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క పాపం కూడా చేయని వారు నా భర్తను తాకితే ఆయన తిరిగి జీవిస్తారు. కానీ పాపాత్ములు తాకితే వారి తల వెయ్యి ముక్కలవుతుంది.’
నిజమైన భక్తి
- అది విన్న అందరూ భయపడి వెనక్కి తగ్గిపోయారు. ఎవరూ ఆ శరీరాన్ని తాకడానికి ముందుకు రాలేదు.
- కొంతసేపటి తర్వాత శివుడిపై అపారమైన విశ్వాసం ఉన్న ఒక వేశ్య అక్కడికి వచ్చింది. ఆమె ముందుగా పవిత్ర గంగానదిలో స్నానం చేసి, భక్తితో ఆ శరీరాన్ని తాకింది.
- అంతే… వెంటనే శివుడు లేచి కూర్చున్నాడు.
శివుని ఉపదేశం
అప్పుడు శివుడు పార్వతితో ఇలా అన్నాడు:
“పార్వతి! గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నా మాటను నమ్మకపోవడంతో చాలా మంది భయపడి వెనక్కి వెళ్లిపోయారు. కానీ నాపై సంపూర్ణ విశ్వాసం ఉన్న ఈ మహిళ మాత్రం గంగాస్నానం చేసి నన్ను తాకింది. భక్తి అందరికీ ఉంటుంది. కానీ నిజమైన విశ్వాసం కొద్దిమందికే ఉంటుంది. కలియుగంలో ప్రజలు మోక్షం కోసం ఎన్నో కర్మలు చేస్తారు. కానీ, భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం మాత్రం ఉండదు. ముక్తి ఎంతో గొప్పది. దాన్ని పొందడానికి అవసరమైనది ఒకటే.. దైవంపై అచంచలమైన విశ్వాసం.
కాశీ మహిమ
అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం కాశీలో గంగాస్నానం విశ్వాసంతో చేస్తే, లేదా అక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇది శివుని వాక్కుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే యుగయుగాలుగా కాశీ హిందువుల ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలిచింది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)
