ఇంట్లో కరెంట్ మీటర్ రీడింగ్ లెక్కలు ఎలా చెక్ చేయాలో తెలుసా..? బిల్ ఎక్కువ వచ్చినప్పుడు..
ఇంట్లో పెద్దగా ఎలక్ట్రిక్ పరికరాలు వాడకపోయినా నెల చివరిలో కరెంట్ బిల్లు భారీగా వస్తే ఎవరికైనా షాక్ కొట్టినట్టే ఉంటుంది. విద్యుత్ వినియోగం తక్కువగా కనిపిస్తున్నా బిల్లు మొత్తంలో పెరుగుదల ఎందుకు వస్తోందనే ప్రశ్న చాలామందిని కలవరపెడుతుంది. అసలు విద్యుత్ బిల్లును ఎలా లెక్కిస్తారు..? మన ఇంట్లో ఎన్ని యూనిట్ల కరెంట్ ఖర్చయిందో డిజిటల్ మీటర్ ద్వారా మనకు మనంగా ఎలా తెలుసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం..

ఇంట్లో పెద్దగా ఎలక్ట్రిక్ పరికరాలు వాడకపోయినా కరెంట్ బిల్లు భారీగా వస్తే చాలామంది ఆందోళన చెందుతారు. వినియోగం తక్కువగా ఉన్నప్పుడు కూడా బిల్లు ఎందుకు ఎక్కువగా వస్తోందనే సందేహం సహజంగానే కలుగుతుంది. అసలు విద్యుత్ బిల్లును ఎలా లెక్కిస్తారు? మీటర్ ద్వారా ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చయిందో మనకు మనంగా ఎలా తెలుసుకోవాలి? అనే ఆలోచన మీకు ఎప్పుడైన వచ్చిందా.. అయితే విద్యుత్ వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి మీటర్‌లో కనిపించే ప్రధాన అంశాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
మీటర్ సీరియల్ నంబర్: తయారు చేసిన సంస్థ కేటాయించే ప్రత్యేక సంఖ్య ఇది. ఏ నిర్దిష్ట మీటర్‌ను అయినా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.
శక్తి (kWh / kVAh): ఒక నిర్దిష్ట కాలంలో మీ ఇల్లు లేదా సంస్థ ఎన్ని యూనిట్ల కరెంట్ వాడిందో ఈ రీడింగ్ చూపుతుంది. సాధారణంగా వినియోగించిన విద్యుత్‌ను యూనిట్లలో లెక్కిస్తారు.
త్రీ ఫేజ్ మీటర్: సాధారణంగా 5 kW లేదా అంతకంటే ఎక్కువ లోడ్ ఉన్న కనెక్షన్లకు త్రీ ఫేజ్ మీటర్ ఉపయోగిస్తారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నచోట ఇది అవసరం.
డిజిటల్ మీటర్ రీడింగ్‌ను మీరే ఎలా చూడాలి?
ప్రస్తుతం వాడుతున్న చాలా డిజిటల్ మీటర్లపై ఒక పుష్ బటన్ ఉంటుంది. ఆ బటన్‌ను వరుసగా నొక్కుతూ పోతే స్క్రీన్‌పై ఈ వివరాలు వస్తాయి.
- ప్రస్తుత సమయం, తేదీ
- మీటర్ సీరియల్ నంబర్
- మొత్తం విద్యుత్ వినియోగం
- ఈ నెలలో గరిష్ట విద్యుత్ డిమాండ్, గత నెల అత్యధిక డిమాండ్, మొత్తం డిమాండ్
- వోల్టేజ్ స్థాయి, విద్యుత్ ప్రవాహం (కరెంట్) పరిమాణం
kWh – kVAh మధ్య తేడా ఏమిటి?
మీటర్ డిస్‌ప్లేలో కనిపించే kWh, kVAh రీడింగులకు బిల్లింగ్‌లో వేర్వేరు ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తవ విద్యుత్ శక్తిని kWh ద్వారా, మొత్తం విద్యుత్ శక్తిని kVAh ద్వారా కొలుస్తారు. సాధారణంగా 10 kW కంటే తక్కువ లోడ్ కనెక్షన్లకు kWh (యూనిట్ ధర) ఆధారంగా, 10 kW కంటే ఎక్కువ లోడ్ కనెక్షన్లకు kVAh ఆధారంగా బిల్లు రూపొందిస్తారు.
బిల్లు ఎక్కువగా వస్తే ఏం చేయాలి?
- అధిక బిల్లు వచ్చినప్పుడు కంగారుపడకుండా ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.
- ప్రస్తుత మీటర్ రీడింగ్‌ను గత నెల బిల్లులోని రీడింగ్‌తో పోల్చి చూడండి.
- బిల్లులో మొత్తం యూనిట్ల ఛార్జీ లెక్క సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి.
- మీటర్ సీరియల్ నంబర్‌ను బిల్లుపై ఉన్న మీటర్ నంబర్‌తో సరిపోల్చండి.
- గడువు తేదీలు, ఇతర ఛార్జీల వివరాలను పరిశీలించండి.
- రీడింగ్ లేదా బిల్లులో తేడా కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.
మీటర్ రీడింగ్ చదవడం, kWh-kVAh తేడాలు తెలుసుకోవడం వల్ల బిల్లులో ఎక్కడ పొరపాటు జరిగిందో సులువుగా గుర్తించవచ్చు.
