స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి ఊరట కలిగింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్ ఖాతాలు ఉపయోగిస్తుంటే ఇది మీకు నిజంగా శుభవార్తే.
వేర్వేరు బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో అకౌంట్లు తెరిచేందుకు గతంలో విడివిడిగా పత్రాలను సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియ సులభతరం కానుంది. ఇక నుంచి పత్రాలను పదేపదే సమర్పించాల్సిన పని లేదు.
కేవైసీ (KYC) ప్రక్రియను సులభతరం చేయడానికి సెబీ ఎనిమిది ప్రధాన మార్పులను చేసింది. అందులో ఆటోమేటిక్‌గా కేవైసీ ధృవీకరణ అనేది ప్రధానమైనది. పదే పదే పత్రాలను సమర్పించడాన్ని ఇది తగ్గిస్తుంది
ఇక నుంచి ఒక పెట్టుబడిదారుడు కొత్త సంస్థలో అకౌంట్ తెరిచినప్పుడు కేవైసీ సమాచారం ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. KRA, సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీ నుండి అందిన తాజా సమాచారం ఆధారంగా రికార్డులను అప్డేట్ చేస్తుంది.
ఆటోమేటిక్‌గా అప్డేట్ చేయడం వల్ల ప్రతీసారి పత్రాలను సమర్పించాల్సిన పని ఉండదు. అయితే ఖాతాదారుడు తమ కేవైసీ రికార్డుల్లోని వివరాలను ధృవీకరించుకునే అవకాశం ఉంటుంది.
అలాగే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ పదే పదే పూర్తి చేయడాన్ని ఇది తగ్గిస్తుంది. KRA రికార్డులలో ధృవీకరించబడి ఆధార్‌కు అనుసంధానమై ఉంటే కొత్త సంస్థ ఖాతా తెరిచేటప్పుడు దానిని తిరిగి ధృవీకరించాల్సిన అవసరం ఉండదు
ఒకవేళ పెట్టుబడిదారుడు ఏదైనా సంస్థతో తన అకౌంట్‌ను మూసివేస్తే తప్పనిసరిగా KRAకు తెలియజేయాలి. మ్యూచువల్ ఫండ్‌లు కాకుండా ఇతర సంస్థలు దీనిని ఐదు రోజుల్లో నివేదించాలి.
KRA రెండు పనిదినాలలోగా సంబంధిత రికార్డులను అప్‌డేట్ చేయడం లేదా తొలగించడం చేయాలి. ఈ కొత్త నిబంధన మ్యూచువల్ ఫండ్‌లకు కూడా వర్తిస్తుంది.
అలాగే పేరు అప్డేట్ చేసుకున్నప్పుడు కొత్త పేరు ఇప్పటికే పాన్, ఆధార్ రెండింటిలోనూ నమోదై ఉంటే.. వారు పేరు మార్పుకు ప్రత్యేక రుజువును అందించాల్సిన అవసరం లేదు.