ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారా..? రేషన్ కార్డు ఈ-కేవైసీ మొబైల్ నుంచే పూర్తి చేయండిలా..
Ration Card: రేషన్ కార్డు ఈకేవైసీని పూర్తి చేయడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. ఇది పూర్తి చేయకపోతే మీరు రేషన్ పొందటంలో ఇబ్బందులు పడవచ్చు. అయితే ఇందుకోసం మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. సింపుల్‌గా యాప్ ద్వారా మీరు పూర్తి చేయవచ్చు.

రేషన్ కార్డులకు ఈకేవైసీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. ఇది పూర్తి చేసేటప్పుడు మీరు రెసిడెంట్ స్టేట్, హోమ్ స్టేట్ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. కేవైసీ ఆమోదం అనేది మీరు ఉన్న ప్రదేశం, అంటే మీ నివాస రాష్ట్రంపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రస్తుతం నివసిస్తున్న రాష్ట్రాన్ని నివాస రాష్ట్రంగా పరిగణిస్తారు. చాలామంది ఉపాధి లేదా ఇతర ప్రయోజనాల కోసం తమ సొంత రాష్ట్రాన్ని విడిచి ఇతర రాష్ట్రాల్లో నివసిస్తుంటారు. ఇలాంటివారు రేషన్ కార్డు ఈకేవైసీని పూర్తి చేసేటప్పుడు.. ప్రస్తుతం నివసిస్తున్న రాష్ట్రాన్నే తమ నివాస రాష్ట్రంగా ఎంచుకోవచ్చు. మీరు స్వరాష్ట్రంలోని నివసిస్తుంటే.. రెండు ఆప్షన్లలో ఒకటే నమోదు చేయాలి.
రేషన్ కార్డు కేవైసీ ఎందుకు ముఖ్యం
నిజమైన లబ్దిదారులకు మాత్రమే రేషన్ సరఫరా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవైసీని తప్పనిసరి చేశాయి. అలాగే రేషన్ సరఫరాలో అక్రమాలకు చెక్ పెట్టడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్ ఈకేవైసీ అనే యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా దేశంలో ఎక్కడినుంచైనా కేవైసీ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం రేషన్ షాపులకు వెళ్లాల్సిన పని లేదు. కేవైసీ కోసం మీ పంచాయతీ పరిధిలోని రేషన్ షాపుకు వెళ్లక్కర్లేదు. ఈ యాప్ ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా సులువుగా నిమిషాల్లోనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
రేషన్ ఈ-కేవైసీ పూర్తి చేయడం ఎలా..?
ముందుగా మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి Mera e-KYC , Aadhar FaceRD యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి
అనంతరం యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి
-రేషన్ కార్డు ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి
-మీ రేషన్ కార్డు నెంబర్, ఇతర అవసరమైన వివరాలు నమోదు చేయాలి
-మీ స్వరాష్ట్రం, నివాస రాష్ట్రాన్ని ఎంచుకోవాలి
-eKYC పూర్తి చేయాల్సిన సభ్యుని ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేయాలి
-ఆధార్‌కు అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయాలి
-స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి
-ఇప్పుడు ఫేస్ ఇ-కెవైసి (Face e-KYC) ఆప్షన్ ఎంచుకోవాలి
-దీనికోసం ఆధార్ ఫేస్‌ఆర్‌డి యాప్ ఓపెన్ చేసి మీ ఫేస్ స్కాన్ చేయాలి
-ధృవీకరణ పూర్తయిన తర్వాత KYC విజయవంతమైందని తెలియజేస్తూ మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది
