AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో ఉజ్జయినిగా రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయం.. భస్మాభిషేకం వెనుక ఆసక్తికర చరిత్ర!

Mahakaleshwar Temple Rajahmundry: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం తరహాలోనే రాజమహేంద్రవరంలోనూ ఓ అద్భుత శైవక్షేత్రం కొలువుదీరింది. నిత్యం చితాభస్మంతో అభిషేకం అందుకునే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన చరిత్ర, 64 ఉపాలయాలు, ప్రత్యేక పూజా విధానాల గురించి తెలుసుకుందాం.

రెండో ఉజ్జయినిగా రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయం.. భస్మాభిషేకం వెనుక ఆసక్తికర చరిత్ర!
Mahakaleshwar Temple Rajahmundry
Rajashekher G
|

Updated on: Nov 29, 2026 | 3:26 PM

Share

Mahakaleshwar Temple Rajahmundry: ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి తరహాలోనే, రాజమహేంద్రవరంలోనూ ఓ అద్భుత శైవక్షేత్రం కొలువుదీరింది. నిత్యం చితాభస్మంతో అభిషేకం అందుకుంటూ, సకల దేవతల సన్నిధిగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక భక్తుడి సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ క్షేత్రం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. రాజమహేంద్రవరానికి చెందిన రోటరీ క్లబ్ సభ్యుడు పట్టపగలు వెంకటరావు, ఓ వివాహ వేడుక కోసం ఉజ్జయినికి వెళ్లినప్పుడు అక్కడి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున జరిగిన భస్మాభిషేకాన్ని చూసి పరవశించిపోయారు. చితాభస్మంతో శివుడికి అభిషేకం చేయడం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనలో కలిగింది.

ఆలయ అర్చకులు తెలిపిన కథనం ప్రకారం, విక్రమాదిత్యుడి పాలనలో ఉజ్జయినిలో ప్రాణాంతక వ్యాధి ప్రబలినప్పుడు, కాలస్వరూపుడైన మహాకాళేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేస్తే ఉపద్రవం తగ్గుతుందని రాజగురువులు సూచించారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని చెబుతారు. ఈ ఐతిహ్యం వెంకటరావులో రాజమహేంద్రవరంలోనూ మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని కలిగించింది.

ఇప్పటికే కోటిలింగాల ఘాట్, ఇన్నీస్‌పేటలో కైలాసభూములను అభివృద్ధి చేసిన ఆయన, గోదావరి తీరాన రెండెకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆగమశాస్త్రం ప్రకారం శైవ, వైష్ణవ సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ నిర్మించిన ఈ ఆలయంలో నాలుగు రాజగోపురాలు, మహామండపాలు, ధ్వజస్తంభాలు, నందులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ఆలయం చుట్టూ 64 ఉపాలయాలను ఏర్పాటు చేశారు. 109 అడుగుల ఎత్తైన ప్రధాన ఆలయం, 75 అడుగుల రాజగోపురం భక్తులను ఆకట్టుకుంటాయి. మహాబలిపురం నుంచి తెప్పించిన నల్లగ్రానైట్‌తో శివలింగాన్ని రూపొందించి, ఐదేళ్ల కృషి అనంతరం 2022 ఏప్రిల్ 6న ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఉజ్జయిని తరహాలోనే ఇక్కడ తెల్లవారుజామున భస్మాభిషేకం, అనంతరం క్షీరాభిషేకం జరుగుతాయి. రాత్రి పది గంటల వరకు భక్తులకు దర్శనాలు అందుబాటులో ఉంటాయి. కైలాసభూముల్లో సేకరించిన చితాభస్మాన్ని శుద్ధి చేసి స్వామివారికి సమర్పిస్తారు. ఈ అభిషేకంలో దివంగతుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొనవచ్చు.

ఆలయంలో ప్రవేశం పూర్తిగా ఉచితం. టికెట్లు, దక్షిణాల భారం లేకుండా భక్తులు స్వయంగా పూజలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. త్వరలో అన్నదాన కార్యక్రమంతో పాటు మరిన్ని ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నారు. భక్తులు, దాతల సహకారంతో ఈ మహాకాళేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.

(Disclaimer: ఈ కథనంలోని చారిత్రక విశేషాలు, భస్మాభిషేక సంప్రదాయానికి సంబంధించిన అంశాలు ఆలయానికి సంబంధించిన సమాచారం, స్థానిక ఐతిహ్యాల ఆధారంగా అందించబడ్డాయి. భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాలను ప్రతిబింబించే ఉద్దేశంతో మాత్రమే ఈ కథనం రూపొందించబడింది.)

మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us