AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thiruppaan Alvar: శ్రీరంగనాథుడి ఆలయంలోకి రానివ్వలేదు.. చివరకు అర్చకుడే భుజాలపై మోసుకెళ్లాడు!

Thiruppaan Alvar Story Telugu: కుల వివక్ష కారణంగా శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలోకి ప్రవేశం నిరాకరించబడిన తిరుప్పాణర్ ఆళ్వార్.. చివరకు ఆలయ ప్రధాన అర్చకుడి భుజాలపై స్వయంగా ఆలయంలోకి ప్రవేశించారు. స్వామిపై ఆయనకున్న అపారమైన భక్తి, పది పాశురాల గానం, రంగనాథుడిలో ఐక్యమైన అద్భుత గాథ వెనుక ఉన్న విశేషాలను తెలుసుకుందాం.

Thiruppaan Alvar: శ్రీరంగనాథుడి ఆలయంలోకి రానివ్వలేదు.. చివరకు అర్చకుడే భుజాలపై మోసుకెళ్లాడు!
Thiruppaan Alvar Story Telugu
Rajashekher G
|

Updated on: Nov 28, 2026 | 9:42 PM

Share

Thiruppaan Alvar Story Telugu: శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీవత్సం అంశతో అయోనిజుడిగా అవతరించిన తొమ్మిదవ ఆళ్వార్ తిరుప్పాణర్. పొలంలో ధాన్యపు రాశిలో దొరికిన ఈ శిశువును మాలదాసరి కుటుంబానికి చెందిన వారు పెంచి పెద్ద చేశారు. ఆ కులాన్ని పాణర్ అని పిలవడంతో ఆయనను పాణర్ అని వ్యవహరించేవారు. అప్పటి సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాల కారణంగా, శూద్ర కులానికి చెందిన వ్యక్తిగా ఆయనను అస్పృశ్యుడుగా ముద్రవేసి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారు. ఆ కాలంలో ఇలాంటి కుల వివక్ష తీవ్రంగా ఉండేది. అయినప్పటికీ, ఆళ్వార్ భక్తి అచంచలమైనది. ప్రతిరోజు కావేరీ నదిలో పవిత్ర స్నానమాచరించి, తన తంబూరాను చేతబట్టి, శ్రీరంగం ఆలయ గోపురం వైపు చూస్తూ ఆనందాశ్రువులు కారుస్తూ స్వామిపై మధురమైన కీర్తనలు ఆలపించేవారు. ఆయన భక్తి స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. అదే కావేరీ నది నుంచి ప్రతిరోజు రంగనాథ స్వామి అభిషేకానికి అర్చక స్వాములు జలం తీసుకువెళ్లేవారు. శ్రీరంగం ఆలయ ప్రధాన అర్చకులు లోకసారంగముని. ఆయన అస్పృశ్యులు నది దగ్గర ఉండకూడదని ఒక నియమాన్ని విధించారు.

ఒకానొక రోజు లోకసారంగముని నదికి రాగా, తిరుప్పాణర్ ఆళ్వార్ సమాధి స్థితిలో కీర్తనలు పాడుకుంటూ లోకాన్ని మరచి అక్కడే ఉండిపోయారు. ఆయనను చూసిన ముని శిష్యులు ఆగ్రహించి వెళ్ళిపొమ్మని కోరారు. ఎంత పిలిచినా, చప్పట్లు కొట్టినా ఆళ్వార్ స్పందించకపోవడంతో, వారు ఆయనపై రాళ్లు విసరడం మొదలుపెట్టారు. రాళ్లు తగలడంతో ఆళ్వార్ తల పగిలి, బాధతో “నన్ను క్షమించండి” అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లోకసారంగముని తన శిష్యుల చర్యను అడ్డుకోలేదు.

ఆలయానికి తిరిగి వెళ్లిన లోకసారంగమునికి ఒక విస్మయకర సంఘటన ఎదురైంది. శ్రీరంగనాథ స్వామి విగ్రహం నుండి రక్తం కారడం ప్రారంభమైంది. “దుర్మార్గులారా! నా భక్తుడిని అలా ఏడిపిస్తారా?” అని స్వామి విగ్రహం నుంచి స్వయంగా పలికింది. స్వామి ఆగ్రహించిన వచనం విని లోకసారంగముని తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడ్డారు.

ఇవి కూడా చదవండి

వెంటనే, లోకసారంగముని శిష్యులతో కలిసి తిరుప్పాణర్ ఆళ్వార్ ఉన్న చోటుకు వెళ్లి క్షమాపణ కోరారు. ఆళ్వార్ ఎలాంటి కోపం లేకుండా, స్వామి దయ అని కీర్తనలు చేసుకుంటున్నారు. అప్పుడు లోకసారంగముని ఆ మహాభక్తుడిని తన భుజాలపై కూర్చోబెట్టుకుని, ఆయన పాదాలను తన శిరస్సుకి తాకించుకుంటూ శ్రీరంగం ఆలయంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి తిరుప్పాణర్ ఆళ్వార్ మునివాహనుడు (ముని మోసినవాడు)గా ప్రసిద్ధి చెందారు.

ఆలయంలోకి ప్రవేశించిన తరువాత, ఆళ్వార్ పది పాశురాలను గానం చేస్తూ శ్రీరంగనాథ స్వామి రూప అలంకరణలను అద్భుతంగా వర్ణించారు. స్వామి రూపాన్ని, ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తూ ఉండగా, ఆళ్వార్ శరీరంలోని ఒక్కొక్క అవయవం మాయమై పువ్వుగా మారి స్వామి పాదాల దగ్గర పడిపోయింది. చివరకు, రంగనాథుని నేత్రాలను వర్ణించిన తరువాత, తిరుప్పాణర్ ఆళ్వార్ స్వామిలో ఐక్యమైపోయారు.

ఈ అద్భుత గాథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది: కులం పేరుతో ఎవరినీ భగవంతుడికి దూరం చేయకూడదు. భగవంతుడికి, భక్తుడికి మధ్య కులాలు, ఆచారాలు వంటి భేదాలు లేవు. మన కులం, ఆచారాలు కేవలం మన గడప లోపలి వరకే పరిమితం. గడప బయటికి వచ్చినప్పుడు మనమంతా మానవులం మాత్రమే. భక్తికి కులమతాలు అడ్డుకావని, నిజమైన శ్రద్ధ, ప్రేమ మాత్రమే భగవంతుడిని చేరడానికి మార్గాలని ఈ దివ్య చరిత్ర స్పష్టం చేస్తుంది.

(Disclaimer: ఈ కథనం హిందూ వైష్ణవ సంప్రదాయాలు, పురాణ గాథలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. ఇందులోని వివరాలు సంప్రదాయ కథనాలుగా పరిగణించాలి.)

మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us