AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్స్‌లో ఆమె అంటే చాలా ఇష్టం.. చూడటానికి దేవతలా ఉంటుంది

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి తన తాత్విక దృక్పథాన్ని, కళాత్మక ఆకాంక్షలను గతంలో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన మాటల్లో చిన్నపిల్లల అమాయకత్వం, కళాకారుల వ్యక్తిత్వం, తనకు ఇష్టమైన పాత్రలు, నటీనటులపై తన అభిప్రాయాలు స్పష్టంగా వినిపించారు. .

హీరోయిన్స్‌లో ఆమె అంటే చాలా ఇష్టం.. చూడటానికి దేవతలా ఉంటుంది
Tanikella Bharani
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2026 | 9:09 PM

Share

తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. చిన్నపిల్లల సహజత్వానికి, వారు చేసే పొరపాట్లకు ప్రత్యేక అందం ఉంటుందని భరణి అన్నారు. పాఠశాలల్లో పిల్లలు తప్పులు చేసినా, అవి ముద్దొస్తాయని, వాటిని సరిదిద్దడం కంటే వారిని వారిలాగే ఉండనివ్వడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతి వెంకట కవుల పద్యం చదివిన చిన్ననాటి సంఘటనను, ఒక పిల్లవాడు పద్యం మధ్యలో మీసాలు పీకిన తీరును ఉదాహరణగా చెప్పారు. పెద్దవారయ్యాక కూడా ఇల్లులు వంటి పదాలు వాడితే తప్పు అనిపించవచ్చని, కానీ పిల్లలకు ఆ అమాయకత్వం ఉంటుందని వివరించారు. భరణికి శకుని పాత్ర చేయాలనే తీవ్రమైన కోరిక ఉందని తెలిపారు. శకుని అనుకూల శత్రువు అని, ఇది అత్యంత సంక్లిష్టమైన పాత్ర అని ఆయన వివరించారు. గాంధారి తమ్ముడైన శకునిని కౌరవులు తీవ్రంగా అవమానించారని, అతని సోదరులను చంపారని గుర్తుచేసుకున్నారు. కౌరవ నాశనమే లక్ష్యంగా, వారి ఇంట్లోనే ఉంటూ, వారి క్షేమం కోరుతున్నట్లు నటిస్తూ, అంతర్గతంగా వారి పతనానికి శకుని ఎలా కారకుడయ్యాడో తెలియజేశారు. తన తండ్రి వెన్నెముకతో పాచికలు చేయించుకుని, వాటి ద్వారా కౌరవులను నాశనం చేయాలని శకుని కంకణం కట్టుకున్న వైనాన్ని వివరించారు. ఈ పాత్రలో ఉండే కాంప్లెక్సిటీ తనకెంతో ఇష్టమని, మహాభారతం తీసే అవకాశం లేకపోవడంతో, అలాంటి స్వభావం ఉన్న పాత్రను ఏదైనా తెలుగు సామాజిక చిత్రంలో చేయాలని ఉందని భరణి తన ఆకాంక్షను వెలిబుచ్చారు.

మహానటుల గురించి మాట్లాడుతూ, మాయాబజార్లో శకుని పాత్ర అనగానే వెంటనే సి.ఎస్.ఆర్. (చిలకలపూడి సీతారామాంజనేయులు) గుర్తొస్తారని చెప్పారు. కె.వి. రెడ్డి గారు అద్భుతమైన దర్శకులని, ఆయన ప్రతి చిత్రంలోనూ ముదిగొండ లింగమూర్తి గారికి కీలక పాత్ర ఉండేదని తెలిపారు. ముదిగొండ లింగమూర్తిని కె.వి. రెడ్డికి రైట్ హ్యాండ్గా అభివర్ణించారు. త్యాగరాజు, వేమన, పోతన వంటి చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలను ఉదాహరణగా పేర్కొన్నారు. ముఖ్యంగా మహామంత్రి తిమ్మరసు చిత్రంలో ఎన్.టి. రామారావు (కృష్ణదేవరాయలు), గుమ్మడి (మహామంత్రి తిమ్మరసు) వంటి దిగ్గజ నటులు ఉన్నా, ముదిగొండ లింగమూర్తి గజపతి హంవీరుడు వేషంలో సీనును డామినేట్ చేశారని కొనియాడారు. ఆయనకు తగినంత పేరు రాలేదే తప్ప, గొప్ప నటుడని భరణి పేర్కొన్నారు. కె.వి. రెడ్డి శకుని పాత్రకు ముందుగా ముదిగొండ లింగమూర్తి పేరు రాసినా, అందులో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండాలని భావించి, సి.ఎస్.ఆర్. ను ఎంపిక చేసిన సంఘటనను ప్రస్తావించారు. దర్శకుడు సినిమా విజయం కోసం స్నేహాన్ని కూడా పక్కన పెట్టే గొప్ప మానవతావాది అని కె.వి. రెడ్డిని ప్రశంసించారు.

ప్రముఖ నటి రేఖపై తనకున్న ప్రగాఢ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, ఆమెను ఒక గొప్ప తత్వవేత్తగా అభివర్ణించారు. మిథునం చిత్రంలో రేఖతో పని చేయించాలని ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యపడలేదని తెలిపారు. రేఖపై తాను రాసిన కవితను చదివి వినిపించారు. “ఆమె ఓ కన్ను కామసూత్రాల కాసారం, రెండోది కరుణారస సాగరం. శృంగార రసాధి దేవతలా ఉండే రేఖ గుండెల్లో నుండి కుతకుతలాడుతున్న లావా. చీకటిని పాయలుగా దువ్వి వేసినట్టు కృష్ణవేణి అంటి జడ. దాన్ని కొసన వేలాడే ప్రేక్షక హృదయాల్లాంటి జడగంటలు. ఆమె చూపు మార్మికంగా, నవ్వు నర్మగర్భంగా, మాట తాత్వికంగా, మనిషి సామాన్యంగా ఉంటుంది. ఆమె యావత్ భూగోళంని ప్రేమించి… ఆమెని యావత్ భూగోళం ప్రేమించింది. కానీ దేవుడు దుర్యోధనుడి కన్నా దుర్మార్గుడు. సూది మొనంత ప్రేమ కూడా ఆమెను సృట్రాయలేదు. రాత్రి పూట ఆమె కామాగ్నికి దగ్ధమవుతున్న నాగినిలా ఉంటుంది. ఉషోదయాన్నే మౌనంగా ధ్యానం చేసుకుంటున్న యోగినిలా ఉంటుంది. భారత చలనచిత్ర వధుటి నుదుట, భారత చలనచిత్ర వధుటి నుదుట నల్లని నామం రేఖ. లక్షలాది… రేఖ అనామిక ప్రేమికుల్లో నేనొకడిని.” అని ఆ కవిత సాగింది. రేఖ జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి వచ్చిన తత్వశాస్త్రం ఆమె మాటల్లో కనిపిస్తుందని, ఆమె ఇంటర్వ్యూలు ఎంతో లోతుగా ఉంటాయని భరణి పేర్కొన్నారు.

Rekha

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us