ఆయనను చూడగానే నోట మాట రాలేదు.. అలా చూస్తుండిపోయా! : సింగర్ సునీత
స్టార్ సింగర్ సునీత ఇప్పుడు బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు సినిమా పాటలు పాడుతూనే టీవీ షోస్, ఓటీటీ షోస్ లో సందడి చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ ఈవెంట్స్, కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తీరిక లేకుండా ఉంటున్నారీ స్టార్ సింగర్.

ప్రముఖ గాయని సునీత గతంలో ఓ కార్యక్రమంలో తన సుదీర్ఘ గాన ప్రయాణంలో సంగీత దిగ్గజం ఇళయరాజా గారితో తన తొలి అనుభవాన్ని, అవకాశం ఎలా వచ్చిందో ఎమోషనల్‌గా పంచుకున్నారు. 1994 నుండి నిరంతరం పెరుగుతున్న తన కెరీర్ గ్రాఫ్‌లో, ఆమె దాదాపు 3000కు పైగా పాటలు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పాడారు. ఈ పాటల్లో సినిమా, భక్తి, ప్రైవేట్ ఆల్బమ్స్ అన్నీ కలిపి ఉన్నాయి. అయితే, తన కెరీర్లో ఒక మరుపురాని అధ్యాయం ఇళయరాజా గారితో ప్రారంభమైందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ అవకాశం చాలా అనూహ్యంగా, అద్భుతంగా వచ్చిందని సునీత వివరించారు. కోదండపాణి స్టూడియోలో ఒక రామనాయుడు సినిమా కోసం మధుపతి సురేష్ గారి దగ్గర పాట పాడుతున్నప్పుడు, తబలా ప్రసాద్ గారు సునీత గానం విని ఎంతగానో ప్రభావితులయ్యారు. తబలా ప్రసాద్ గారు ఆమెతో, “నేను ఇమీడియట్గా నెక్స్ట్ ఇళయరాజా గారి కాల్షీట్కి వెళ్తున్నాను. ఒకవేళ గనక నేను నీకు ఫోన్ చేస్తే స్టూడియోకి, నువ్వు వెంటనే అన్నీ వదిలేసి వచ్చేసేయ్” అని చెప్పారు. ఈ మాటలు విన్న సునీత మొదట నమ్మలేకపోయారు, “అదేంటది? అది ఎలా సాధ్యం?” అని అనుకున్నారు.
ఆశ్చర్యకరంగా, ప్రసాద్ గారు ఫోన్ చేసిన కేవలం 15 నిమిషాల్లోనే మధుపతి సురేష్ గారికి ఫోన్ వచ్చిందని సునీత తెలిపారు. “సురేష్, ఎలా పంపిస్తావో తెలియదు. ఆ అమ్మాయిని అర్జెంట్‌గా ప్రసాద్ ల్యాబ్‌కు పంపించు” అని ఆదేశం అందింది. వెంటనే సునీత ప్రసాద్ డీలక్స్ స్టూడియోకు వెళ్లారు. అక్కడ కంపోజింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే ఆమెకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోయారు. “తెల్లగా ఒక పరుపు, పక్కన అంతే తెల్లగా ఉన్నటువంటి ఇంకొక దిండు… హార్మోనియం పెట్టా. అగరువత్తులు వెలిగించి ఉన్నాయి. లోపలికి వెళ్తే, రూమ్ లోకి, నేను నిజంగా ఒక కంపోజర్స్ రూమ్ లోకి వెళ్లానా, లేక ఒక కోవెలకి వెళ్లానా అని ఒక్క క్షణం పాటు నాకు డౌట్ వచ్చింది” అని ఆమె ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ రూమ్‌లో ఇళయరాజా గారిని చూడగానే కలిగిన భక్తి భావంతో, ప్రశాంత వాతావరణంతో సునీత నోట మాట రాలేదన్నారు.
ఇళయరాజా గారు ఆమెను “రా అమ్మ కూర్చో” అని ఆదరంగా ఆహ్వానించారు. “నువ్వు పాటలు పాడావా ఇంతకు ముందు?” అని అడిగారు. సునీత, “లేదండీ, ఇప్పుడే పాడుతున్నాను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను” అని సమాధానం ఇచ్చారు. క్లాసికల్ నేర్చుకున్నావా అని అడగ్గా, “నేర్చుకున్నానండి” అని తెలిపారు. అయితే, ఆ సమయంలో తాను ఏమి మాట్లాడానో కూడా తనకు గుర్తులేదని, ఆయనను చూస్తూ అలా ఉండిపోవడమే తన వంతు అయిందని సునీత అన్నారు. ఆ తర్వాత ఇళయరాజా గారు “ఏది, నీకు నచ్చిన ఏదో ఒక పాట పాడు” అని కోరగా, సునీత నారాయణ తీర్థ తరంగం ఆలపించారు.
అదే రోజు సాయంత్రం సునీతకు ఒక అద్భుత అవకాశం లభించింది. బెంగళూరు నుంచి ఒక పాట రికార్డింగ్ కోసం రావాల్సిన సీనియర్ గాయని విమానం మిస్ అవ్వడంతో, పుణ్యవతి సినిమాలోని ఆ పాటను పాడే అవకాశం సునీతకు లభించింది. “సో, మై సిన్సియర్ థాంక్స్ టు యు ఆ రోజు రానందుకు. ఇట్స్ మై ప్లెజర్” అని సరదాగా ఆ రోజు రాని గాయనిని ఉద్దేశించి అన్నారు. ఇదే తన కెరీర్లో ఇళయరాజా గారితో మొట్టమొదటి అవకాశం అని సునీత తెలిపారు. ఆ తర్వాత, మరుసటి రోజు, ఆ తర్వాతి రోజు కూడా ఇళయరాజా గారు సునీతతో పాటలు పాడించారు. తమిళ భాషలో “ళ” వంటి అక్షరాలను ఎలా పలకాలో నేర్పి, అచ్చమైన తమిళ అమ్మాయి పాడుతున్నట్టుగా పాడేలా శిక్షణ ఇచ్చింది ఇళయరాజా గారేనని ఆమె కృతజ్ఞతా భావంతో పేర్కొన్నారు. ఇది ఆమెకు చాలా పెద్ద అదృష్టం అని, ఆయనది “గొప్ప చెయ్యి” అని ప్రశంసించారు. అంతేకాకుండా, ఇళయరాజా గారు సునీతను కన్నడ చిత్రసీమకు కూడా పరిచయం చేశారు. భూమిగీత అనే ఆర్ట్ ఫిలింలో చరణ్‌తో కలిసి ఆమె పాటలు పాడారు, తమిళంలో కూడా చరణ్‌తో కలిసి ఒకే పాటతో పరిచయం అయ్యారు. కన్నడలో కూడా చరణ్‌తో ఆమె “హిట్ పెయిర్”గా మారారు. ఈ అద్భుతమైన కాంబినేషన్‌తో తాను చాలా సంతోషంగా ఉన్నానని సునీత అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
