Canada ban flights: భారత ప్రయాణికుల రాకపోకలపై కెనడా ఆంక్షలు.. 30 రోజుల పాటు విమానాలపై నిషేధం.. వీటికి మాత్రమే మినహాయింపు..!
భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా కొనసాగుతోంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. మన దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై వివిధ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
Canada ban Indian flights: భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా కొనసాగుతోంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. మన దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై వివిధ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఏకంగా భారత విమానాలపై నిషేదం విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది. ఇండియా నుంచి వచ్చే ప్యాసింజర్, కమర్షియల్ విమానాలను 30 రోజులపాటు నిషేదిస్తున్నట్లు కెనడా రవాణాశాఖ మంత్రి ఒమర్ అల్ఘబ్రా ప్రకటించారు. భారత్ నుంచి కెనడాకు వస్తున్న విమాన ప్రయాణికుల్లో ఎక్కువగా కరోనా కేసులను గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఇండియాతోపాటు పాకిస్థాన్ నుంచి వచ్చేవారిపైకి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. అయితే కార్గో విమానాలు, వ్యాక్సిన్ల వంటి అత్యవసర సరుకులను రవాణా చేసే విమానాలు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
గత రెండు వారల్లో కెనడాలోని టొరంటో, వాన్‌కోవర్‌కు ఢిల్లీ నుంచి 18, లాహోర్ నుంచి రెండు విమానాలు వచ్చాయని, వారిలో ఒక్కో విమానంలో కనీసం ఒక్క ప్రయాణికుడైనా అనారోగ్యానికి గురైనట్లు ఆదేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కెనడాకు వచ్చే విదేశీ ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరని ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశంలో ప్రస్తుతం మూడో విడుత కరోనా విజృంభణ కొనసాగుతోంది. కెనడా శుక్రవారం 9 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 11,51,276కు చేరింది. ఇందులో 23,812 మంది కరోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే విదేశీ ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు కెనడా రవాణాశాఖ మంత్రి ఒమర్ అల్ఘబ్రా తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందన్నారు.