కోవిడ్ ఉధృతి, జర్మనీ నుంచి ఇండియాకు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ దిగుమతి
సెకండ్ కోవిడ్ వేవ్ నేపథ్యంలో జర్మనీ నుంచి ఇండియా అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్లను, కంటెయినర్లను దిగుమతి చేసుకుంటోంది. దేశ,లోని పలు ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత....
సెకండ్ కోవిడ్ వేవ్ నేపథ్యంలో జర్మనీ నుంచి ఇండియా అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్లను, కంటెయినర్లను దిగుమతి చేసుకుంటోంది. దేశ,లోని పలు ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత తీవ్రంగా పీడిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను విమానాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనితో బాటు ఆక్సిజన్ కంటెయినర్లు కూడా భారత్ చేరనున్నాయి. ఇండియాతో స్నేహ సంబంధాలు నెరపుతున్న మిత్ర దేశాలు ఇలా సాయం చేస్తున్నాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో ఆక్సిజన్ కంటెయినర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. దీంతో వీటి విషయమై ప్రభుత్వం స్టేక్ హోల్డర్లతో చర్చలు జరపడం ప్రారంభించింది.
ఇక ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, ఇతర మందులను విమానాల ద్వారా సప్లయ్ చేసే చర్యను ప్రభుత్వం అప్పుడే చేపట్టింది. భారత వైమానిక దళం..డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని అత్యవసర సేవలకు వినియోగించుకుంటోంది. ఇప్పటివరకు ఐ ఏ ఎఫ్.. కొచ్చి, ముంబై, వైజాగ్, బెంగుళూరు నగరాల నుంచి వీరిని తరలించింది. ఢిల్లీలో డీ ఆర్ డీ ఓ కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు కోసం వీరిని తరలించినట్టు ఐ ఏ ఎఫ్ వర్గాలు వివరించాయి,. బెంగుళూరు నుంచి ఢిల్లీలోని కోవిడ్ సెంటర్లకు డీ ఆర్ డీ ఓ ఆక్సిజన్ కంటెయినర్లను కూడా ఈ సంస్థ రవాణా చేసింది. దేశంలో ఇప్పుడు మహారాష్ట్ర తరువాత ఢిల్లీ అత్యధిక కరోనా వైరస్ కేసులతో తల్లడిల్లుతోంది. అనేక ఆసుపత్రులు ఆక్సిజన్ లేక దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే ఉంటోంది. దీంతో అటు రోగులు, ఇటు హాస్పిటల్ యజమాన్యాలు దిక్కు తోచని పరిస్థితిలో పడుతున్నారు. వందల సంఖ్యలో వస్తున్న కరోనా రోగులకు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆసుపత్రులు డీలా పడుతున్నాయి.