Andhra Pradesh vs Telangana: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేడు ఢిల్లీలో కీలక భేటీ.. 14 అంశాలపై చర్చ..
Andhra Pradesh vs Telangana: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో..
Andhra Pradesh vs Telangana: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలు, ఆస్తుల పంపకాలపై చర్చ జరగనుంది. విభజన చట్టంలోని అంశాల అమలుకు ఇప్పటివరకు అనేకసార్లు సమీక్షా సమావేశాలు జరిగాయి. కానీ చాలా విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలైనా అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవాళ జరగబోయే మీటింగ్‌లో ఇరు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది.
ఈ సమావేశం ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నాయి. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా, మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు. ఎజెండాలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఏడు అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్‌ల విభజన, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనతో పాటు పలు అంశాలు చర్చకు రానున్నాయి. అదేవిధంగా ఏపీ రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, ఏపీ విభజన చట్టం కింద పన్ను రాయితీలు, ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు, నూతన విద్యాసంస్థల ఏర్పాటు, నూతన రాజధానిలో రాపిడ్ రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచన..
ఇదిలాఉంటే.. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి సూచించారు. గతంలో కేంద్రం రెండు రాష్ట్రాలతో..అనేక సమావేశాలు నిర్వహించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్లుగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని స్పష్టం చేశారు కేంద్రమంత్రి. ఈ ఫ్యాక్టరీ చేబడితే ప్రజాధనం వృధా చేయడమే అవుతుందన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఇదే పరిస్థితి అని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలను భరించడం కోసం సెయిల్‌తో సంప్రదింపులు జరిపామని వివరించారు కిషన్ రెడ్డి.
ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు..
తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ వేడుకలను ఇవాళ ఢిల్లీలో జరుపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇండియా గేట్ సమీపంలోని కర్తవ్యపథ్‌లో తొలిసారి బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానున్న సంబురాల్లో తెలుగు మహిళా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉద్యోగులు, పలువురు మహిళా కేంద్ర మంత్రులు పాల్గొంటారు. తెలంగాణ బతుకమ్మ పండుగ విశిష్టతను దేశ ప్రజలకు చాటి చెప్పడానికే ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి కిషన్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..