Telangana: తెలంగాణలో అవినీతి అధికారులు ఆ శాఖల్లోనే అధికం..
తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. ఈ ఏడాది 220కి పైగా కేసులు, 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టులతో రికార్డు స్థాయి చర్యలు చేపట్టింది. ట్రాప్ కేసుల సంఖ్య పెరగడమే కాదు, కీలక శాఖల్లోని అవినీతి అధికారులపై దాడుల తీవ్రత మరింత పెరిగింది.

తెలంగాణలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్యూరో) ఈ ఏడాది సరికొత్త రికార్డులు నమోదు చేసింది. కరప్షన్ కేసుల నమోదులో గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరుగుదల కనిపించింది. అవినీతి అధికారులను వెంటాడుతూ ఏసీబీ చర్యలు చెప్పటిoది . ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణ ఏసీబీ 220కు పైగా కేసులను నమోదు చేసింది. ఈ కేసుల్లో 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడం విశేషం. ముఖ్యంగా అధిక శాతం కేసులు ట్రాప్ కేసులే కావడం గమనార్హం. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారుల సంఖ్య ఈ ఏడాది మరింత పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏసీబీ నమోదు చేసిన కేసుల సంఖ్య దాదాపు 100 వరకు ఎక్కువగా ఉంది. గత సంవత్సరం మొత్తం 152 కేసులు నమోదు కాగా, వాటిలో 223 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఏడాది కేసుల సంఖ్య మాత్రమే కాకుండా, దాడుల తీవ్రత కూడా పెరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
అత్యధికంగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ఏసీబీ వలలో చిక్కడం విశేషం. కీలక శాఖల్లో పనిచేస్తున్న అధికారులు లంచాలకు అలవాటు పడటంపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఏసీబీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల నమోదులో కూడా ఈ ఏడాది పెరుగుదల కనిపించింది. అవినీతితో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 17 మంది అవినీతి అధికారుల భరతం పట్టినట్టు ఏసీబీ వెల్లడించింది. మొత్తంగా చూస్తే, తెలంగాణలో అవినీతిపై ఏసీబీ చేపడుతున్న చర్యలు మరింత కఠినంగా మారాయి. భవిష్యత్తులో కూడా అవినీతిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఏసీబీ ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
