CBSE Revised Time Table 2026: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్.. కొత్త షెడ్యూల్ ఇదే!
సీబీఎస్‌ఈ బోర్డు నిర్వహించనున్న 10వ, 12వ తరగతుల పరీక్షల టైం టేబుల్ 2026 ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం పది, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 9 వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు కంట్రోలర్ (ఎగ్జామ్స్) భరద్వాజ్ గతంలో వెల్లడించారు. ఆ మేరకు టైం టేబుల్ కూడా విడుదల చేశారు..

హైదరాబాద్, డిసెంబర్ 31: సీబీఎస్‌ఈ బోర్డు నిర్వహించనున్న 10వ, 12వ తరగతుల పరీక్షల టైం టేబుల్ 2026లో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు సీబీఎస్సీ బోర్డు ప్రకటించింది. మార్చి 3, 2026న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సీబీఎస్సీ పదో తరగతి, 12వ తరగతుల విద్యార్థులకు మార్చి 3న జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు సీబీఎస్‌ఈ తన ప్రకటనలో వెల్లడించింది.
పరిపాలనాపరమైన కారణాల వల్లనే ఈ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు వివరించింది. దీంతో మార్చి 3వ తేదీన పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన పరీక్షను మార్చి 11వ తేదీకి మార్పు చేసింది. అలాగే 12వ తరగతి విద్యార్థులకు మార్చి 3న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 10వ తేదీకి మార్పు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. ఈ మార్పు మినహా మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. ఇతర పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని తెలిపింది.
కాగా సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026 నుంచి ప్రారంభమవుతాయి. పరీక్షలు ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరగనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 3న పదో తరగతి విద్యార్థులకు టిబెటన్, జర్మన్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, జపనీస్, స్పానిష్, మిజో, కశ్మీరీ, ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ వంటి పరీక్షలు జరగాల్సి ఉంది. ఇక 12వ తరగతి విద్యార్థులకు ఇదే తేదీన లీగల్ స్టడీస్ పరీక్ష జరగాల్సి ఉంది. తాజాగా మార్చి 3వ తేదీన జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేయడంతో ఆయా పరీక్షలు మార్చి 11, ఏప్రిల్ 10 తేదీల్లో జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాలలు తమ విద్యార్థులకు వీలైనంత త్వరగా సమాచారాన్ని తెలియజేయాలని బోర్డు సూచించింది.
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల కొత్త టైం టేబుల్ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




