AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్ధుల ఎగ్జాంలో ఆ ప్రశ్న అడిగినందుకు.. ప్రొఫెసర్‌ సస్పెండ్!

జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ)లో మంగళవారం (డిసెంబర్‌ 23) ఓ ప్రొఫెసర్‌ సస్పెండ్‌ అయ్యారు. బీఏ (ఆనర్స్) సోషల్ వర్క్ సబ్జెక్ట్‌ క్వచ్చన్ పేపర్‌లో ఓ ప్రశ్న అందుకు కారణం. ముస్లింలపై జరుగుతున్న దారుణాలపై ప్రశ్నను సెట్ చేసినందుకు గానూ వర్సిటీ సదరు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. అయితే ప్రొఫెసర్‌ సస్పెన్షన్‌ను వర్సిటీలోని..

విద్యార్ధుల ఎగ్జాంలో ఆ ప్రశ్న అడిగినందుకు.. ప్రొఫెసర్‌ సస్పెండ్!
Jamia Suspends Professor Over Question On Exam
Srilakshmi C
|

Updated on: Dec 24, 2025 | 7:46 PM

Share

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ)లో మంగళవారం (డిసెంబర్‌ 23) ఓ ప్రొఫెసర్‌ సస్పెండ్‌ అయ్యారు. బీఏ (ఆనర్స్) సోషల్ వర్క్ సబ్జెక్ట్‌ క్వచ్చన్ పేపర్‌లో ఓ ప్రశ్న అందుకు కారణం. ముస్లింలపై జరుగుతున్న దారుణాలపై ప్రశ్నను సెట్ చేసినందుకు గానూ వర్సిటీ సదరు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. అయితే ప్రొఫెసర్‌ సస్పెన్షన్‌ను వర్సిటీలోని అనేక మంది JMI విద్యార్థులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ సస్పెన్షన్‌ను విద్యా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. ఈ క్రమంలో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలేం జరిగిందంటే..

ఈ ఏడాది డిసెంబర్ 21న బీఏ సోషల్ వర్క్ సెమిస్టర్ 1లో ‘భారతదేశంలో సామాజిక సమస్యలు’ పేపర్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష క్వశ్చన్‌ పేపర్‌లో ‘భారతదేశంలో ముస్లింలపై జరుగుతున్న దారుణాలకు తగిన ఉదాహరణలు ఇచ్చి చర్చించండి?’ అంటూ ప్రశ్న వచ్చింది. అయితే ఈ విధమైన క్వశ్చన్‌ పరీక్షలో అడగడంపై నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. దీనిని విద్యార్దులకు మతతత్వం నూరిపోయడంగా నెటిజన్లు అభివర్ణించారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఈ ప్రశ్న స్వభావం ప్రతి ఒక్కరికీ అవగత మవుతుంది. ఇది మతతత్వాన్ని రెచ్చగొట్టేలా ఉంది. ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఈ విధమైన ప్రశ్నను ఎలా అడగగలదు? ఇలాంటి వివాదాస్పదమైన పాఠాలు విద్యార్దులకు బోధిస్తున్నారా? అంటూ సోషల్ మీడియాలో ఓ యూజర్‌ ప్రశ్నించడంతో ఈ వివాదం రాజుకుంది.

ఈ క్రమంలో నిందిత ప్రొఫెసర్‌పై JMI చర్యలకు ఉపక్రమించింది. అఫీషియేటింగ్ రిజిస్ట్రార్ CA షేక్ సఫియుల్లా సంతకం చేసిన JMI ఉత్తర్వు పత్రం ఒకటి విడుదలైంది. సోషల్ వర్క్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నిర్లక్ష్యం, అజాగ్రత్తను విశ్వవిద్యాలయం తీవ్రంగా పరిగణించినట్లు అందులో పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే వరకు సదరు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. మరోవైపు పరీక్షలో ఇలాంటి ప్రశ్న ఇవ్వడంపై మాత్రం సదరు ప్రొఫెసర్‌ ఇంతవరకు స్పందించలేదు. వర్సిటీ విచారణ కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

అయితే విద్యార్థి సంస్థ అయిన ఫ్రాటెర్నిటీ మూవ్‌మెంట్ నిందిత ప్రొఫెసర్‌కు మద్దతు ఇవ్వడం గమనార్హం. విద్యా రంగాలలోకి చొరబడుతున్న హిందూత్వ ఫాసిస్టులకు తలొగ్గడాన్ని ఆయన ధైర్యంగా నిరాకరించినందుకు ప్రొఫెసర్‌కు మేము మద్దతు ఇస్తున్నామంటూ ప్రకటించింది. జామియా చాలా కాలంగా విమర్శనాత్మక ఆలోచన, భిన్నాభిప్రాయాలకు నిలయంగా ఉందని, అది అలాగే కొనసాగుతుందని సమర్ధించింది. కాగా ఇటీవల దేశ రాజధానిలో ప్రకంనలు సృష్టించిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసుల అల్ ఫలాహ్ వర్సిటీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అక్కడి డాక్టర్లు ఉగ్ర చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమవడంతో వర్సిటీ గుర్తింపు రద్దు చేశారు. యూజీసీకి చెందిన నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ (NAAC‌) షోకాజు నోటీసులు పంపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.