Ashwini Vaishnaw: ఆ విషయంలో రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
ఫాక్స్‌కాన్‌లో భారీ ఉద్యోగాల కల్పనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ విజయాన్ని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. .. ..

ఫాక్స్‌కాన్‌లో భారీ ఉద్యోగాల కల్పనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ప్రధాని మోదీ మానస పుత్రిక ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ విజయాన్ని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి వల్ల భారత్ ఇప్పుడు వినియోగదార దేశం నుంచి ఉత్పత్తి దేశంగా మారుతోందని స్పష్టం చేశారు. మహిళల ఆధ్వర్యంలో సాగుతున్న ఫాక్స్‌కాన్ యూనిట్ ఉద్యోగ కల్పనలో కొత్త అధ్యాయానికి నిదర్శనమని తెలిపారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో కేవలం 8–9 నెలల్లో 30 వేల ఉద్యోగాల కల్పన జరగడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఇది భారత్‌లో ఇప్పటివరకు చూసిన అత్యంత వేగవంతమైన ఫ్యాక్టరీ ర్యాంప్-అప్ అని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం మహిళలే ఉండటం, వారి వయసు ఎక్కువగా 19–24 ఏళ్ల మధ్య ఉండటం, చాలామందికి ఇది మొదటి జాబ్ కావడం ప్రత్యేకతగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది కేవలం గణాంకం కాదని, గౌరవప్రదమైన ఉద్యోగ సృష్టికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. ‘మేక్ ఇన్ ఇండియా విజయాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు’ అంటూ రాహుల్ గాంధీకి కౌంటర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి వల్ల భారత్ వినియోగ దేశం నుంచి ఉత్పత్తి దేశంగా మారుతోందని, తయారీ రంగంలో ప్రపంచానికి పోటీగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
Thanks @RahulGandhi for acknowledging the success of PM Shri @narendramodi Ji’s ‘Make in India’ programme. As you have noted, we are becoming a producer economy as we implement our PM’s vision. pic.twitter.com/1K8kmE6s3t
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 24, 2025
